- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇష్టారాజ్యంగా బహుళ అంతస్తుల భవన నిర్మాణం.. పట్టించుకోని అధికారులు
రాజకీయ అండతో అడ్డగోలుగా భవనాలు నిర్మించేస్తే..? అంగబలాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే..? నిబంధనలకు నీళ్లొదిలేస్తే..? మనల్ని అడిగేదెవరన్న ధీమాతో అక్రమ నిర్మాణాలు చేపడితే..?

దిశ, ఖమ్మం రూరల్: రాజకీయ అండతో అడ్డగోలుగా భవనాలు నిర్మించేస్తే..? అంగబలాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే..? నిబంధనలకు నీళ్లొదిలేస్తే..? మనల్ని అడిగేదెవరన్న ధీమాతో అక్రమ నిర్మాణాలు చేపడితే..? అలాంటి నిర్మాణాలను అధికారులు పట్టించుకోకపోతే..? ఇంకేముంది.. అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపూ ఉండదంతే! ఇటీవల అక్రమ నిర్మాణాల కూల్చివేతతో హడావుడి చేసిన అధికారులు.. అక్రమ బహుళ అంతస్తు నిర్మాణాల వైపు మాత్రం కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ఏదులాపురం మున్సిపాలిటీ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న ఈ బహుళ అంతస్తు అధికారుల కంటపడకపోవడం విశేషం. పెద్దతండా పరిధిలోని 26వ డివిజన్ గీస్కానగర్లో ఓ వ్యక్తి అక్రమంగా ఐదు అంతస్తులు బహుళ అంతస్తు భవనాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
‘అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. నిబంధనలకు మీరి నిర్మాణం చేపడితే నోటీసులు ఇచ్చి సదరు నిర్మాణాన్ని నేలమట్టం చేస్తాం’..ఇది ఏదులాపురం మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు చెప్పే మాట. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ప్రమాదకరంగా నిర్మాణాలు జరుగుతున్నా.. బాధ్యతగా వ్యవహరించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ వ్యక్తి 900 గజాల్లో నిర్మిస్తున్న భవనానికి ఎటువంటి అనుమతులు లేవని తెలిసింది. గతంలో ఎప్పుడు పంచాయతీలో నిర్మాణానికి అనుమతులు తీసుకున్నాడని అది కూడా గడువు ముగిసిందని తెలిసింది. దీంతో పాటు సుడా నిబంధనల కనీసం పాటించకుండా సెట్‌బ్యాక్‌లకు ఎగనామం పెట్టడంతో పాటు జీ+2 నిర్మాంచాల్సి ఉన్న ఇప్పటికే నాలుగు అంతస్తులు నిర్మించాడు.
నిర్మాణ భవనం చుట్టూ నాలుగు దిక్కులా ఉండాల్సిన సెట్‌బ్యాక్‌లు సైతం ఉల్లంఘించి నిర్మిస్తున్నారు. భవనం ముందు వైపు 3 మీటర్లు సెట్ బ్యాక్ ఉండాల్సి ఉండగా, దానికి బదులుగా కేవలం 1.4 మీటర్ల స్థలాన్ని వదిలారు. ఇలా మూడు దిక్కులా సెట్ బ్యాక్ 2 మీటర్లు వదిలి పెట్టి నిర్మించాల్సి ఉంటుంది. సుడా అనుమతులు లేకుండా దాదాపు 900గజాల్లో అక్రమంగా భవనం నిర్మిస్తుండటంతో మున్సిపల్‌కు చలాన్‌రూపంలో లక్షల రుపాయలకు ఎగనామం పెట్టాడు. నిబంధనలకు విరుద్ధంగా అంతస్తుల మీద అంతస్తుల నిర్మాణం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు.
చర్యలు తీసుకుంటాం..
ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్
అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనం నిర్మాణంపై చర్యలు తీసుకుంటాం. టౌన్‌ప్లానింగ్ అధికారులను పంపించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఎవరైనా సుడా నిబంధనల ప్రకారం.. భవనాలు నిర్మించాల్సిందే. లేదంటే ఎవరినీ ఊపేక్షించేది లేదు.






