- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కన్నీటి సంద్రమైన మోస్రా.. స్వగ్రామానికి చేరిన కానిస్టేబుల్ సౌమ్య భౌతికకాయం
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య (33) భౌతికకాయం ఆదివారం ఆమె స్వగ్రామానికి చేరుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య (33) భౌతికకాయం ఆదివారం ఆమె స్వగ్రామానికి చేరుకుంది. నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రానికి ఆమె మృతదేహం చేరుకోగానే గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ధైర్యసాహసాలతో విధులు నిర్వర్తించిన తమ బిడ్డ విగతజీవిగా మారడాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు గ్రామస్తులంతా కన్నీరుమున్నీరయ్యారు.
అశ్రునయనాల మధ్య తుది వీడ్కోలు
సౌమ్య మృతదేహాన్ని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. పోలీసు, ఎక్సైజ్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున హాజరై ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు.. సౌమ్య అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం..
జనవరి 23న నిజామాబాద్ జిల్లాలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకునే క్రమంలో సౌమ్య తీవ్రంగా గాయపడింది. దీంతో హైదరాబాద్‌లోని పంజాగుట్ట నిమ్స్ (NIMS) ఆసుపత్రిలో గత వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో ఎక్సైజ్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సౌమ్య త్యాగాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఈ విషాద ఘటనపై స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం కీలక ప్రకటన చేశారు. సౌమ్య కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా (ఆర్థిక సాయం) ప్రకటించారు. ఆమె కుటుంబంలో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గంజాయి, మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన సౌమ్య మృతి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి వ్యక్తమవుతోంది.






