CM Revanth Reddy: తెలంగాణలోనూ ఓట్ల చోరీకి కుట్ర.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-08-18 09:32:25  IST  )

ఓట్ల చోరీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

CM Revanth Reddy: తెలంగాణలోనూ ఓట్ల చోరీకి కుట్ర..  రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో : తెలంగాణలోనూ దొంగ ఓట్ల ద్వారా ఓట్ల చోరీ (vote chori) చేసే కుట్ర చేస్తున్నారని, అందరం కలిసికట్టుగా వారి భరతం పడదామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పిలుపునిచ్చారు. ఓటు హక్కును దొంగిలించిన వారిని శిక్షించాలని రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని త్వరలో నేను, డిప్యూటీ సీఎం ఆ పాదయాత్రలో పాల్గొని మద్దతు ఇస్తామన్నారు. ఇవాళ రవీంద్రభారతిలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (Sardhar Sarvai Papanna Goud) 375వ జయంతి వేడుకలకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బుద్దపూర్ణిమ ప్రాజెక్టు ఆఫీస్ వద్ద పాపన్న గౌడ్ విగ్రహానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీలు కూడా రాజ్యాధికారంలో భాగం కావాలని అన్నారు. విద్య ఒక్కటే తలరాతలు మారుస్తుందని, నాణ్యమైన చదువు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. కులగణనను తప్పుపడితే వందేళ్ల వరకు బహుజనులకు న్యాయం జరగదన్నారు. బహుజనుల సామ్రాజ్యాన్ని అందరికీ ఎలా అందించవచ్చో పాపన్న గౌడ్ నిరూపించారని పేర్కొన్నారు. పాపన్నగౌడ్ కోటను గత ప్రభుత్వాలు మైనింగ్ లీజులకు ఇచ్చాయన్నారు. కానీ తాము చరిత్ర స్ఫూర్తితో కోటను చారిత్రక కట్టడాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు చెప్పారు.

బీసీలకు బీజేపీ అన్యాయం..

బీజేపీ బీసీలకు అన్యాయం చేస్తోందని సీఎం మండిపడ్డారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో ఆర్డినెన్స్‌లను ఆమోదించి కేంద్రానికి పంపామని, 5 నెలలైనా ఆమోదించకపోతే ధర్నా చేశామని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఆ ధర్నాకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుంది కిషన్ రెడ్డి, మోడీ కాదా? అని ప్రశ్నించారు. మతం ముసుగులో బహుజనుల రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని, రాహుల్ గాంధీపై కోపం ఉంటే ఆయనపై చూపాలని, కానీ ఆయన సిద్ధాంతాలపై చూపొద్దన్నారు.

Next Story