Congress: శశిథరూర్ తప్పుకున్నారా తప్పించారా?

by Prasad Jukanti |   (  Updated:2025-07-28 07:28:43  IST  )

కాంగ్రెస్ పార్టీలో శశిథరూర్ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

Congress: శశిథరూర్ తప్పుకున్నారా తప్పించారా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అంశంపై ఇవాళ పార్లమెంట్ లో చర్చ జరగబోతున్నది. ఇందుకోసం 16 గంటల సమయం కేటాయించారు. అయితే కాంగ్రెస్ తరఫున ఈ చర్చలో పాల్గొనబోయేది ఎవరనేది ఆసక్తిగా మారింది. ఈ డిబెట్ లో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పాల్గొనబోవడం లేదని తెలిసింది. కాంగ్రెస్ తరఫున ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, గౌరవ్ గొగోయ్, ప్రియాంక గాంధీ, దీపేందర్ హుడా, పరిణితి షిండే, షపి పరంబిల్, మాణిక్కం ఠాగూర్, రాజా బరాద్ పాల్గొనబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదంపై ప్రపంచానికి వివరించేందుకు ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత ప్రభుత్వం ఎంపీల బృందాలను వివిధ దేశాలకు విదేశాలకు పంపించింది. అమెరికాకు వెళ్లిన ఎంపీల బృందానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నాయకత్వం వహించారు. అటువంటి శశిథరూర్ పేరు డిబెట్ లో మాట్లాడే వారి జాబితాలో లేకపోవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.

తప్పుకున్నారా తప్పించారా?

ఆపరేషన్ సిందూర్ తర్వాత శశిథరూర్ కు కాంగ్రెస్ కు మధ్య గ్యాప్ నెలకొందనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే శశిథరూర్ పై కాంగ్రెస్ నేతలు స్వరం పెంచుతున్నారు. అయితే పార్టీ లైన్ కు భిన్నంగా వ్యవహరిస్తున్న శశిథరూర్ ను ఇగ్నోర్ చేయడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ్టి చర్చలో ఆయన పేరును పక్కన పెట్టిందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ డిబేట్ లో తన పేరు లేకపోవడంపై మీడియా అడిగిన ప్రశ్నకు శశిథరూర్ మాట్లాడేందుకు ఇష్టపడలేదు. అయితే ఈ చర్చలో పాల్గొనడానికి పార్టీ శశిథరూర్ ను సంప్రదించినప్పటికీ ఆయన స్వచ్చందంగా నిరాకరించినట్లు మరో వాదన వినిపిస్తోంది.

Next Story