- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిల్‌రాజు తీరుపై కాంగ్రెస్ సీరియస్.. ఆ సమయంలోనూ సీఎం ఆగ్రహం
ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, సినీ నిర్మాత దిల్ రాజుపై కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో : ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, సినీ నిర్మాత దిల్ రాజుపై కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తున్నది. చైర్మన్ హోదాలో ఆయన పరిశ్రమను సమన్వయం చేయాల్సిన బాధ్యతను మరిచి ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరించడంపై హస్తం పార్టీ ఫైర్ అవుతున్నట్టు సమాచారం. ప్రభుత్వ ప్రతినిధిగా ఉండి ఫిల్మ్ చాంబర్ ఎలక్షన్‌లో ఓ వర్గానికి సపోర్టు చేస్తున్నారని, దీంతో ఆయన ప్రత్యర్థి వర్గం మొత్తం సర్కారుకు వ్యతిరేకంగా మారిందని కాంగ్రెస్ లీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేడు ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు
నేడు (ఆదివారం) ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ జరుగనున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి పెద్ద నిర్మాతలు (ప్రొగ్రెసివ్ ప్యానెల్) వర్సెస్ చిన్న నిర్మాతలుగా (మన ప్యానెల్) విడిపోయారు. తమ సినిమాలకు పెద్ద నిర్మాతలు థియేటర్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ చిన్న నిర్మాతలు వారికి వ్యతిరేకంగా బరిలోకి దిగారు. దీంతో ఏ వర్గం ఈసారి చాంబర్ ఎన్నికల్లో విజయం సాధిస్తుందనేది ఆసక్తిగా మారింది. ప్రొగ్రెసివ్ ప్యానల్‌కు అల్లు అరవింద్, సురేశ్ బాబు, దిల్ రాజు బలపరుస్తుండగా, మన ప్యానెల్‌కు చిన్న నిర్మాతలైన సీ.కళ్యాణ్, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు సపోర్టుగా ఉన్నారు.
సమాన దూరంలో ఉంటే హుందా తనం
దిల్ రాజు ఓ వర్గానికి అనుకూలంగా, మరో వర్గానికి వ్యతిరేకంగా ఉండటం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ప్రతినిధిగా రెండు వర్గాలకు సమాన దూరంలో ఉంటే హుందాగా ఉండేదనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. అలా కాకుండా కేవలం ఓ వర్గానికి అనుకూలంగా ఉండటంతో పరిశ్రమలోని మరో వర్గాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దిల్ రాజు ప్రభుత్వ ప్రతినిధి అన్న విషయం మరిచి వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. పలు సందర్భాల్లో ఆయన వ్యవహరించిన తీరుతో సర్కారుకు తలనొప్పులు వచ్చిన విషయాలను నాయకులు గుర్తు చేస్తున్నారు.
ఎఫీడీసీ చైర్మన్ తీరుతో సర్కారుకు ఇబ్బందులే
ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య సమన్వయం చేస్తారనే ఉద్దేశంతో సినీ పరిశ్రమలో తమకు నమ్మకమైన వ్యక్తిగా ఉన్న ఓ వ్యక్తికి రూలింగ్ పార్టీలు ఎఫ్‌డీసీ (ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) చైర్మన్ పదవి ఇస్తుంటాయి. కాంగ్రెస్ పవర్‌లోకి వచ్చిన తర్వాత సినీ నిర్మాత దిల్ రాజుకు ఆ పదవి కట్టబెట్టారు. ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్‌కు ఉపయోగపడింది ఏమీ లేదనే విమర్శలున్నాయి. చాలా విషయాల్లో ఆయన నిర్మాతగానే వ్యవహరించారే తప్పా ప్రభుత్వ కోణంలో ఏనాడూ ఆలోచించలేదనే టాక్ ఉంది.
దిల్ రాజుపై సీఎం సీరియస్
జూబ్లీహిల్స్ ఎన్నికల టైంలో తమ వేతనాలు పెంచాలని కోరుతూ సినీ కార్మికులు సమ్మెబాట పట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సినీ కార్మికుల ఓట్లు 20 వేల వరకూ ఉంటాయి. ఎఫ్‌డీసీ చైర్మన్‌గా ఉన్న దిల్ రాజు కార్మికులతో సంప్రదింపులు జరిపారే తప్పితే సమస్య పరిష్కరించడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి. ఎందుకంటే ఆయన ప్రభుత్వ ప్రతినిధిగా కాకుండా నిర్మాతల కోణంలో ఆలోచించడంతో సమ్మె ఎక్కువ రోజులు కొనసాగిందని ఆనాడు ఆరోపణలొచ్చాయి. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి.. దిల్ రాజుపై ఆగ్రహం వ్యక్తం చేసి ఆయనే స్వయంగా రంగంలోకి దిగి సినీ కార్మికులతో చర్చలు జరిపారు. వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పాటు టికెట్ల ధరలు పెంచితే వచ్చే లాభాల్లో 20% కార్మికులకు ఇవ్వాలని కండీషన్ పెట్టారు.






