- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్థానిక సంస్థల ఎన్నికలకు "సై" అంటున్న కాంగ్రెస్ పార్టీ
గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఇటీవలనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి నూతనోత్తేజం తో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఇటీవలనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి నూతనోత్తేజం తో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. లోకల్ బాడీ ఎన్నికల కోసం ఎప్పటి నుంచో అధికార పార్టీ రాజకీయ వ్యూహాలు, ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉన్నది. గతంలో ఒకసారి లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం న్యాయస్థానాల తీర్పుతో వాయిదా పడిన స్థానిక ఎన్నికలు హడావుడి తిరిగి మొదలైంది. మూడు విడతలుగా జరుగనున్న ఈ ఎన్నికల్లో తొలి విడత డిసెంబర్ 11న, 14న రెండో విడత, 17న మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. అయితే తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.
ఇక రెండో విడత ఎన్నికల నామినేషన్లు ఈ నెల 30 నుంచి, మూడో విడత ఎన్నికల నామినేషన్లు వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. దీనితో అధికార పార్టీ ఆ మేరకు శ్రేణులను సన్నద్దం చేసింది. స్థానిక పోరుకు ముందే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే అంశంపై దృష్టి సారించి జిల్లాలో ఇటీవలనే డీసీసీలకు నూతన అధ్యక్షుల నియామక ప్రక్రియను కాంగ్రెస్ అధిష్టానం పూర్తి చేసింది. మెజారిటీ డీసీసీలలో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐలలో పనిచేసిన యూత్ లీడర్లను ఆ పోస్టుల్లో నియమించారు. కాంగ్రెస్ అధినాయకత్వం పార్టీకి యువ రక్తాన్ని ఎక్కించారు.
డీసీసీల నియామక కీలక ఘట్టం పూర్తి కావడంతో కాంగ్రెస్ మేజర్ టాస్క్ పూర్తి చేసినట్లు అయిందని పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. ఇక డీసీసీల నియామకంలో కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత అవకాశాలు దక్కక అసంతృప్తితో ఉన్న కీలక నేతలను సమన్వయం పరిచేందుకు జిల్లా మంత్రులు, ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారని పార్టీ నేతలు చెప్తున్నారు. అసంతృప్తి నేతలను బుజ్జగించేందుకు జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, పీసీసీ కార్యవర్గంలో చోటు, నామినేటెడ్ పదవులు, ఇతర ముఖ్య పదవులు ఇస్తామని వారికి హామీలు ఇస్తున్నట్లు సమాచారం.
సంక్షేమ పథకాలు.. బీసీ రిజర్వేషన్ల కృషే ప్రచారాస్త్రాలు..
సంస్థాగతంగా బలోపేతంపైన దృష్టి సారించి దాదాపు పూర్తి చేసిన కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సన్నద్ధం అవుతుంది. ఈనెల 19 ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదలై, డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు కొనసాగనున్నది. దాదాపుగా 60 లక్షల చీరల పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంతో రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణమాఫీ, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్లలోపు వరకూ ఉచిత గృహా విద్యుత్, రూ.500 లకి గ్యాస్ సిలండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్స్, బస్సులు ఇవ్వడం లాంటి పథకాలను అందిస్తున్నందున ప్రజలు తమకు అనుకూలంగా ఉన్నారని హస్తం నేతలు చెప్తున్నారు. ఇక బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వంగా చేయాల్సిన కృషి చేశామని, కానీ, కేంద్రంలోని బీజేపీ పార్టీ అడ్డం పడిందన్న అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
డీసీసీల ప్రకటనతో.. కొన్ని జిల్లాల్లో అసంతృప్తులు..
లోకల్ బాడీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఇటీవలనే కొత్త జిల్లా అధ్యక్షులను కాంగ్రెస్ నియమించింది. అయితే కొన్ని జిల్లాల్లో నేతల మద్య తగాదాలు, వివాదాలు, వర్గపోరు తీవ్రం కావడంతో పార్టీకి ఎన్నికల ముందు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. నల్లగొండ డీసీసీ చీఫ్కైలాష్నేతను తొలగించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాన్ని పార్టీ హైకమాండ్ ఏ విధంగా పరిష్కరిస్తుందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఇక సిద్దిపేట జిల్లాలో నెలకొన్న వర్గపోరుతో కూడా నూతన డీసీసీ ఎంపికతో మరింత ముదిరిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లోనూ నేతల మధ్య వర్గపోరు తీవ్రం కావడంతో అధిష్టానం జోక్యం చేసుకునే సిట్యుయేషన్ నెలకొన్నదని హస్తం నేతలు అంటున్నారు. డీసీసీలు పదవులు పొందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా తాము మంత్రి పదవులు ఆశిస్తే జిల్లా అధ్యక్ష పదవులు ఇచ్చారని, దీనితో తమకు కేబినెట్‌లో స్థానం దక్కదన్న ఒకింత అసంతృప్తితో ఉన్నట్లుగా తెలిసింది.






