స్థానికానికి సై అంటున్న కాంగ్రెస్.. డీసీసీ చీఫ్‌ల నియామకాలపై కసరత్తు?

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-16 02:45:44  IST  )

అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీహిల్స్​ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్​పార్టీ తర్వాతి ఎన్నికలకు సన్నద్ధమవుతున్నది.

స్థానికానికి సై అంటున్న కాంగ్రెస్.. డీసీసీ చీఫ్‌ల నియామకాలపై కసరత్తు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీహిల్స్​ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్​పార్టీ తర్వాతి ఎన్నికలకు సన్నద్ధమవుతున్నది. జూబ్లీహిల్స్​ఎన్నికలకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మొదట అధికార పార్టీ భావించింది. కానీ పలు కారణాలతో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వాయిదాపడిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ లో తాము ఆశించిన కంటే తమ అభ్యర్థికి భారీగా మెజార్టీ వచ్చిందని సంబురపడుతున్నారు. రాష్ట్రంలో ఈ సానుకూల వాతావరణంలోనే ఎన్నికలకు వెళ్తే మంచి విజయాలు సాధించవచ్చనే యోచనలో హస్తం పార్టీ నేతలు ఉన్నట్లు తెలిస్తోంది. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు ఈనెల 17న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆ జీవోను న్యాయస్థానం కొట్టివేయడంతో పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్తారా? లేక పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు కేటాయిస్తూ లోకల్​బాడీస్ ఎన్నికలకు వెళ్తారా? అనే విషయంపై సోమవారం కేబినెట్​సమావేశంలో క్లారిటీ రానుంది. ఇదే మంచి తరుణమని భావిస్తున్న నేతలు ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపుతున్నట్లు పార్టీలో చర్చ నడుస్తున్నది. స్థానిక ఎన్నికలకు వెళ్లే ముందు కొత్త పథకాలు ప్రకటిస్తారా? లేక కొత్త హామీలు ఇస్తారా? లేక పెండింగ్​లో ఉన్న గ్యారెంటీలను అమలు చేసేందుకు కీలక ప్రకటనలు ఏమైనా చేస్తారా? అనే అంశం ఉత్కంఠగా మారింది.

డీసీసీ చీఫ్ ల నియామకం

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపుతున్న రేవంత్​రెడ్డి సర్కార్ అంతకుముందే జిల్లాలకు నూతన అధ్యక్షుల నియామకాన్ని చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ ఇటీవల మీడియాతో చేసిన ఇష్టాగోష్టిలో ఎప్పుడైనా డీసీసీల నూతన అధ్యక్షుల ప్రకటన రావొచ్చని తెలిపారు. దీనితో లోకల్ బాడీస్ ఎలక్షన్లకు ముందే కొత్త డీసీసీ చీఫ్​లను నియమిస్తే వారు మరింత ఉత్సాహంగా పార్టీ కోసం పనిచేస్తారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ పరంపరలో ఒక్కో జిల్లా నుంచి ముగ్గురు పేర్లను ఏఐసీసీ పరిశీలకులకు అందజేశారు. అక్కడి నుంచి గ్రీన్​సిగ్నల్​వచ్చిన వెంటనే కొత్త డీసీసీ అధ్యక్షుల పేర్ల ప్రకటన వెలువడుతుంది. వారి నియామకం కాగానే టీపీసీసీ జిల్లా కార్యవర్గాల కూర్పును పూర్తి చేస్తుంది. డీసీసీ పదవులకు ఎమ్మెల్యేలు సైతం పోటీపడటం, పార్టీలో ఈ పదవులకు విపరీతంగా పోటీ ఉండటంతో స్థానిక ఎన్నికలకు ముందే ప్రకటిస్తే సమస్యలు సమసిపోతాయని భావిస్తున్నారు. మరోవైపు డీసీసీ జాబితాలో ఉండి పదవులు రాని వారికి కార్యవర్గంలో చోటు కల్పించనున్నారు. అలాగే వారికి స్థానిక ఎన్నికల్లో జెడ్పీటీసీ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వడం, ఇతర పార్టీ పదవుల్లో ప్రియార్టీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. మొత్తానికి జూబ్లీహిల్స్ విజయం కాంగ్రెస్ పార్టీలో సరికొత్త జోష్ నింపిందని నేతలు పేర్కొంటున్నారు.

Next Story