TG: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా.. ఇప్పటి వరకు ఎవరికి ఎన్ని స్థానాలంటే?

by Prasad Jukanti |

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. మున్సిపాలిటీల్లో, మున్సిపల్ కార్పొరేషన్లలో హస్తం పార్టీ ముందంజలో ఉండగా, కొన్ని చోట్ల హంగ్ పరిస్థితులు నెలకొన్నాయి. ఇండిపెండెంట్లు కీలకంగా మారడంతో చైర్‌పర్సన్ పీఠాల కోసం రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.

TG: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా.. ఇప్పటి వరకు ఎవరికి ఎన్ని స్థానాలంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో (Telangana Municipal Elections 2026) అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ నెల 11న జరిగిన పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం 8గంటల నుంచి ప్రారంభమైంది.ఈ ఫలితాల్లో హస్తం పార్టీ విపక్షాలపై స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. మధ్యాహ్నం 12:30 గంటల వరకు అందిన సమాచారం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్-53(Congress Party) , బీఆర్ఎస్-9 (BRS), బీజేపీ-1 (BJP), ఎంఐఎం-1 లీడ్‍లో కొనసాగుతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ 3 చోట్ల ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఈ ఫలితాల్లో జనసేన ఖాతా తెరిచింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఫలితాల్లో చాలామట్టుకు మంత్రులు తమ ఇలాకాలో సత్తా చాటగా మంత్రి వివేక్ వెంకటస్వామికి మాత్రం సొంత నియోజకవర్గంలో బిగ్ షాక్ తగిలింది. క్యాతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.

కీలకంగా ఇండిపెండెంట్లు:

ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల మేరకు అలంపూర్, దేవరకద్ర, కోహీర్, కేసముద్రం, ఇస్నాపూర్ మున్సిపాలిటీల్లో హంగ్ పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఐదు స్థానాలతో పాటు మరికొన్ని చోట్ల చైర్‌పర్సన్ల పీఠం కైవసం చేసుకునేందుకు స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు. కోహీర్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డుల్లో కాంగ్రెస్ 8 చోట్ల విజయం సాధించగా ఐదు స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఒక్కో వార్డుల్లో ఎంఐఎం, బీజేపీ, ఇండిపెండెంట్ గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్‌కు కాంగ్రెస్ ఒక్క స్థానం దూరంలో ఉండటంతో ఇండిపెండెంట్ కీలకంగా మారారు.

మెజారిటీ వార్డులు కాంగ్రెస్‌వే..

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీలలో 2852 వార్డులు ఉండగా వీటిలో 12 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఒక చోట ఎన్నిక వాయిదా పడింది. మొత్తం 2,569 వార్డులకు పోలింగ్ జరగగా వీటిలో 841 వార్డుల్లో కాంగ్రెస్, 406 వార్డుల్లో బీఆర్ఎస్, 116 వార్డుల్లో బీజేపీ గెలుపొందాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల లెఫ్ట్ పార్టీలు సైతం వార్డుల్లో విజయం సాధించాయి.

Next Story