ఆ పాప జాతరలో చనిపోలేదు.. కావాలనే రాజకీయం చేస్తున్నారు: ఎంపీ మల్లు రవి

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-28 12:32:45  IST  )

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామ మల్లన్న జాతరలో 2 నెలల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే. కుల సంఘాల నిరసనలతో ఈ జాతర వివాదాస్పదంగా మారింది.

ఆ పాప జాతరలో చనిపోలేదు.. కావాలనే రాజకీయం చేస్తున్నారు: ఎంపీ మల్లు రవి
X

దిశ, వెబ్‌డెస్క్: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామ మల్లన్న జాతర(Kummera Jatara incident)లో 2 నెలల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే. కుల సంఘాల నిరసనలతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ ఘటనపై స్థానిక కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి(MP Mallu Ravi) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మల్లన్న జాతరలో ఘర్షణ జరిగింది వాస్తవం.. కానీ ఆ పాప మృతికి ఘర్షణ కారణం కాదు.. ఫిబ్రవరి 18న ఘర్షణ జరిగితే.. 21న ఆ పాప మృతి చెందారు. ఆ పాప మృతి అత్యంత బాధాకరం.. కానీ మరణానికి అక్కడ ఘర్షణ కారణం కాదు. కొబ్బరి కాయలు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారనే అంశంలో గొడవ జరిగింది. పాప తండ్రి గణేష్ తాను ఎక్కువ ధరలకు కొననని గొడవకు దిగడంతో ఘర్షణ జరిగింది. అక్కడ గణేష్‌కు, శ్రీనివాస్ రెడ్డి‌ల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ జరిగిన గొడవలతో పోలీసులకు రెండు వర్గాలు ఫిర్యాదు చేసుకున్నారు.

అయితే.. గణేష్ కూతురు నెలల నిండక ముందే పుట్టింది. ఆమె లంగ్స్ సమస్యలతో బాధ పడుతోంది. ఆ కారణంగానే ఆ పాప మరణించింది. పాప మరణానికి జాతరలో జరిగిన ఘర్షణకు ఎలాంటి సంబంధం లేదు. ఘర్షణ జరిగిన మూడు రోజుల తర్వాత గణేష్ వాళ్ళు పాపను ఘర్షణలో చంపేసారని తప్పుడు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా ఆ పాప తల్లి ఎస్సీ కాదు.. అయినా కూడా వాళ్ళు అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, గ్రామ బీఆర్ఎస్ నాయకులు తిరుపతి రెడ్డి వారి రాజకీయాల కోసం ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నారు. దీనిని ప్రజా సంఘాలు, మీడియా ప్రతినిధులు అర్దం చేసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ఉంది. ఎప్పుడూ ఎవరికీ కాంగ్రెస్ అన్యాయం చేయదు. చేస్తుంటే చూస్తూ ఊరుకోదు. అన్యాయంగా ఎవరూ బలి కావొద్దు అనేదే మా లక్ష్యం. చిన్న పాప మరణాన్ని రాజకీయం చేయొద్దు’ అని మల్లు రవి విజ్ఞప్తి చేశారు.

Next Story