విజయశాంతి వెనకున్న అదృశ్య 'హస్తం' ఎవరిది?

by Gantepaka Srikanth |

సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతికి అనూహ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

విజయశాంతి వెనకున్న అదృశ్య హస్తం ఎవరిది?
X

దిశ, తెలంగాణ బ్యూరో: సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతికి అనూహ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కొంత కాలంగా క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆమెను పెద్దలసభకు పంపించడం వెనక ఉన్న ఆంతర్యమేంటనే డిస్కషన్ తెరపైకి వచ్చింది. రాష్ట్ర నేతల్లో ఎవరైనా ఆమెను సిఫార్సు చేశారా? లేక విజయశాంతి సొంతంగా లాబీయింగ్ చేసుకున్నారా? అనే చర్చ జరుగుతున్నది.

కొంత కాలంగా దూరంగా..

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి ఆ తర్వాత ఎక్కడా పెద్దగా కనిపించలేదు. గాంధీభవన్‌లో జరిగిన పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరైన సందర్భాలు చాలా తక్కువేనని ఆ పార్టీ లీడర్లు మాట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు మహిళలకు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల విషయాలపైనా ఆమె ఎక్కడా మాట్లాడలేదు. దీంతో యాక్టివ్ పాలిటిక్స్‌కు విజయశాంతి దూరంగా ఉంటున్నారని అందరూ భావించారు. కానీ, నాలుగైదు రోజుల కిందట ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలిసినట్టు టాక్. ఆమెను ఢిల్లీలో చూసిన స్టేట్ లీడర్లు పెద్దగా పట్టించుకోలేదని టాక్. కానీ, ఉన్నట్టుండి ఆమెకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో అందరూ ఒకింత షాక్‌‌కు గురయ్యారు.

ఏఐసీసీ నేతలే పిలిచారా?

ఏఐసీసీ నేతలే స్వయంగా విజయశాంతికి ఫోన్ చేసి ఢిల్లీకి పిలిపించుకుని పదవి ఆఫర్ చేసినట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. హైకమాండ్‌లోని ఓ కీలక నేతతో ఆమె లాబీయింగ్ చేశారని మరికొందరు అంటున్నారు. పదవి కోసం ఆమె చాలా కాలంగా లాబీయింగ్ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమిస్తారనే ఊహగానాలు తొలుత వినిపించాయి. కానీ, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమెను పెద్దల సభకు పంపడానికి హైకమాండ్ మొగ్గుచూపినట్టు చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్, బీజేపీతో పనిచేసిన అనుభవం రాములమ్మకు ఉన్నది. దీంతో కేసీఆర్‌ను ఎండగట్టడంతో పాటు బీజేపీని సైతం ఎటాక్ చేసే బాధ్యతలను ఢిల్లీ పెద్దలు ఆమెకు అప్పగించినట్టు తెలిసింది. ఒక్క ఎమ్మెల్సీతో సరిపుచ్చుతారా? భవిష్యత్‌లో మరేదైనా పదవి ఇస్తారా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నది.

Next Story