నోటిఫికేషన్ల విడుదల కోసం TGPSC ప్రాసెస్ చేస్తోంది : నిరుద్యోగులకు కాంగ్రెస్ భరోసా

by Ramesh Naini |   (  Updated:2026-02-03 12:54:45  IST  )

కేటీఆర్ నిరుద్యోగుల గురించి మాట్లాడమంటే.. చంపిన వ్యక్తే.. మళ్ళీ వచ్చి సంతాపం తెలిపినట్లు ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు.

నోటిఫికేషన్ల విడుదల కోసం TGPSC ప్రాసెస్ చేస్తోంది : నిరుద్యోగులకు కాంగ్రెస్ భరోసా
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కేటీఆర్ నిరుద్యోగుల గురించి మాట్లాడమంటే.. చంపిన వ్యక్తే.. మళ్ళీ వచ్చి సంతాపం తెలిపినట్లు ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులు కలవడానికి కూడా కనీసం అపాయింట్‌ మెంట్ ఇవ్వని నువ్వు.. ఇప్పుడు వారి గురించి మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఆయన కౌంటర్ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వ పాలనలోనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతోందని, ఇప్పటి వరకు 70వేల ఉద్యోగాలు భర్తీ చేసి నియామక పత్రాలు అందజేసినట్లు స్పష్టం చేశారు. మరిన్ని నోటిఫికేషన్ల విడుదల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ఇందుకు గాను TGPSC కూడా ప్రాసెస్ మొదలు పెట్టింది, అభ్యర్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను కొనసాగిస్తోందని అన్నారు. త్వరలోనే మరికొన్ని నియామకాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేస్తుందని నిరుద్యోగులకు భరోసా కల్పించారు.

కేటీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న మీరు.. ఎంత వరకు ఉద్యోగాలు ఇచ్చారో.. ఉద్యోగాలను అంగట్లో సరుకులు లెక్క ఎట్ల అమ్ముకున్నారో అందరికీ తెలుసని ఆరోపించారు. మీ పదేళ్ల పాలనలో నిరుద్యోగులకు ఏం చేశారో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. పదో తరగతి పరీక్షల నుంచి, గ్రూప్-1 ఉద్యోగాల పరీక్షల వరకు పేపర్లు లీకు చేసి, విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నది మీరు కాదా? అని ప్రశ్నించారు. మేము అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 70 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని, మరిన్ని ఉద్యోగ నియామకాల కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, దీనిని జీర్ణించుకోలేని కేటీఆర్.. ప్రజా ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు న్యాయం చేయడానికి ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని అన్నారు. కనీసం నిరుద్యోగులకు కలవడానికి కూడా అపాయింట్ మెంట్ ఇవ్వని మీరు.. ఇప్పుడు వారి గురించి మీరు మాట్లాడటం సిగ్గుచేటు అని విమర్శించారు. నిరుద్యోగులు ప్రతిపక్షాల మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు.

Next Story