బీఆర్ఎస్‌లో హరీష్ రావు పాత్ర ఏంటి?.. ఆది శ్రీనివాస్ ప్రశ్నల వర్షం

by Gantepaka Srikanth |

ఎమ్మెల్సీ కవితపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వ విప్​ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్‌ను ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీ సీఎల్పీ మీడియా సెంటర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

బీఆర్ఎస్‌లో హరీష్ రావు పాత్ర ఏంటి?.. ఆది శ్రీనివాస్ ప్రశ్నల వర్షం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ కవితపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వ విప్​ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్‌ను ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీ సీఎల్పీ మీడియా సెంటర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కవిత వ్యాఖ్యలపై ఇప్పటివరకు కేసీఆర్, కేటీఆర్, హరీష్​స్పందించలేదని, దెయ్యలు, కోవర్టుల గురించి నోరు మెదపడం లేదని, దమ్ముంటే కవిత ప్రశ్నలకు హరీష్​రావు సమాధానం చెప్పాలని ఆది శ్రీనివాస్ శ్రీనివాస్​డిమాండ్​చేశారు. బీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని హరీష్ రావు చెబుతున్నాడు.. పాపం హరీష్ రావు.. చాలా అమాయకంగా ఉన్నాడని చెప్పుకొచ్చారు. అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటే కదా పొత్తు పెట్టుకునేదని సెటైర్లు వేశారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, స్వయంగా కేసీఆర్ కూతురే బయటపెట్టారని అన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ అక్రమ సంబంధాన్ని కవిత సాక్ష్యాలతో సహా బయటపెట్టిందన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావడం ఖాయం.. సరైన సయమంలో ఇద్దరు ఒకటైపోతారు.. ఈటల రాజేందర్ మధ్యవర్తిగా వ్యవహారం జరుగుతుందనే ప్రచారం ఉందని ఆరోపించారు. హరీష్ రావు మాత్రం పొత్తులు లేవని బీఆర్ఎస్ కేడర్ మభ్యపెట్టేందుకు మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ చీకటి స్నేహంపై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పటి నుంచి చెబుతూ వస్తున్నారన్నారు. పొత్తుల గురించి మాట్లాడటానికి హరీష్ రావు ఎవరు..? హరీష్ రావుకు బీఆర్ఎస్‌లో ఉన్న పాత్ర ఏమిటీ..? ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల్లో ఆయన ఒకరు అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవంతోనే బీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు మాత్రమే లీడర్లని తేల్చారు.. హరీష్ రావు ఫొటో కూడా రజతోత్సవ సభలో పెట్టలేదన్నారు.

కేసీఆర్, కేటీఆర్ చెప్పకుండా హరీష్ రావు ఎందుకు పొత్తులపై ఎందుకు ప్రకటనలు చేస్తున్నారని ప్రశ్నించారు. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పలేని హరీష్ రావు.. మా ముఖ్యమంత్రి పైన నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని సూచించారు. 21 వేల కోట్ల రుణమాఫీ చేయలేదని, చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు దొంగ సవాల్ చేస్తున్నారని విమర్శించారు. గ్రామాల వారీగా లెక్కలు ఉన్నాయి.. కావాలంటే హరీష్ రావుకు ఇస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా జాబితా ఇచ్చాం.. ప్రతి ఎమ్మెల్యే దగ్గర ఈ లిస్ట్ ఉందని వ్యాఖ్యానించారు. రైతులకు హరీష్ రావు ఎవరు ఏమీ చేశారో? బహిరంగ చర్చకు మేం సిద్ధం అని ఆది శ్రీనివాస్​సవాల్​విసిరారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని కాంగ్రెస్​ప్రభుత్వం పండుగలా చేసింది అని శ్రీనివాస్​అన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా బాధ్యతాయుతంగా వ్యవహారించిందన్నారు. కానీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. ఫామ్ హౌస్‌లో నైనా అమరవీరులను స్మరించుకోవచ్చు కదా..? అన్నారు. అమరవీరులకు నివాళులు అర్పించడానికి మీకు ఎందుకు చేతులు రాలేదని దుయ్యబట్టారు. అధికారం ఉంటేనే మీకు తెలంగాణ, అమరవీరులు గుర్తుకు వస్తారా..?అని ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కేసీఆర్ ఫామ్ హౌస్, కొడుకు అమెరికాలో , కూతురు ఆమె ఆఫీసులో ఉండిపోయారని విమర్శించారు.

Next Story