ఇప్పటివరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క!.. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్చరిక

by Ramesh Naini |

డబ్బు అహంకారంతో ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఇప్పటివరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క!.. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అవాకులు, చవాకులు పేలితే ఊరుకోమని, డబ్బు అహంకారంతో ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ నేత, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం అసెంబ్లీలోని సీఎల్పీ మీడియా హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ వాడే భాషను చూసి యావత్ తెలంగాణ సమాజం తలదించుకుంటోందని విమర్శించారు. సొంత చెల్లి, బావ ఫోన్లను కూడా ట్యాప్ చేసిన ఘనత కేటీఆర్‌దేనని, అటువంటి వ్యక్తి తల ఎక్కడ పెట్టుకుంటారని సత్యం నిలదీశారు. అమెరికాలో చదువుకున్నానని చెప్పుకునే కేటీఆర్ సంస్కారం ఇదేనా? అని సత్యం ప్రశ్నించారు. అమరవీరుల త్యాగాల పునాదులపై పదవులు అనుభవించి, రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అడ్డగోలు దోపిడీ వల్ల తెలంగాణ ప్రజలపై లక్షల కోట్ల అప్పుల భారం పడిందని ఆరోపించారు.

గత అసెంబ్లీ ఎన్నికల నుంచి మొన్నటి పంచాయతీ ఎన్నికల వరకు ప్రజలు బీఆర్ఎస్‌కు చావు దెబ్బ కొడుతున్నా కేటీఆర్‌కు బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఫేక్ సర్వేలతో గెలిచామని చెప్పుకున్నారని, కానీ ప్రజలు వారిని అసహ్యించుకున్నారని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి 'గుండు సున్నా' రావడం వారి పతనానికి నిదర్శనమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్‌లా అడ్డదారిలో పదవులు పొందలేదని సత్యం స్పష్టం చేశారు. జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచి, పీసీసీ అధ్యక్షునిగా తన సత్తా చాటి ప్రజల మన్ననలతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలిస్తూ అందరి మనసులను గెలుచుకుంటున్నారని పేర్కొన్నారు.

ఇప్పటివరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క, సీఎం పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే తెలంగాణలో తిరగనివ్వం. విమర్శలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. కేటీఆర్ తన వైఖరి మార్చుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు చేతల్లోనే సమాధానం చెబుతారు అని మేడిపల్లి సత్యం హెచ్చరించారు.

Next Story