బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే.. మురికి కాలువలో వేసినట్లే: మేడిపల్లి సత్యం

by Gantepaka Srikanth |

పదేళ్ల పాటు అధికారంలో ఉన్నా కేసీఆర్ ఏనాడైనా బీసీల గురించి మాట్లాడారా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రశ్నించారు.

బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే.. మురికి కాలువలో వేసినట్లే: మేడిపల్లి సత్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదేళ్ల పాటు అధికారంలో ఉన్నా కేసీఆర్ ఏనాడైనా బీసీల గురించి మాట్లాడారా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రశ్నించారు. సోమవారం సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. చేపలు, గొర్రెల గురించి తప్ప బీసీ రిజర్వేషన్ల గురించి ఏనాడైనా నోరువిప్పారా అంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తుంటే అది చూసి కేటీఆర్ తట్టుకోలేక పోతున్నాడని అన్నారు. భయంతో కేటీఆర్ నోటికొచ్చిన అబద్ధాలు చెబుతున్నాడు. బీసీల గురించి అంత చిత్తశుద్ధి ఉంటే 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు పోరాటం చేయడం లేదని నిలదీశారు. సామాజిక అంశంపై మా సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకు బీఆర్ఎస్ అండగా ఉండటం లేదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఎందుకు గెలిపించాలని, బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మురికి కాలువలో వేసినట్లే నని అన్నారు.

ఎవరైనా ఓటు వేస్తే కేటీఆర్ దాన్ని బీజేపీకి అమ్ముకుంటాడని, స్థానిక ఎన్నికల్లో గెలవడం కోసం బీఆర్ఎస్, బీజేపీ లోపాయకారి ఒప్పందానికి సిద్ధం అవుతున్నాయని అన్నారు. ఎప్పటికైనా బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోతాయని జోస్యం చెప్పారు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం తప్పా అందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. నాట్లకు ముందే 9 రోజుల్లో 9 వేల కోట్ల రైతు భరోసా ఇచ్చిన చరిత్ర మా ప్రభుత్వానిదని చెప్పుకొచ్చారు. రైతులు సంతోషంగా ఉంటే కేటీఆర్ ఓర్వలేక పోతున్నాడని అందుకే ఆయన అసహనంలో రగిలిపోతున్నారని అన్నారు. సన్న బియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నాం, ఇందిరమ్మ ఇళ్లు, ఆడ బిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని వివరించారు. పదేళ్లలో అనేక అబద్దాలు ఆడిన మీకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని అన్నారు. సంక్షేమ హాస్టల్స్ పైన బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.

Next Story