యూరియా కోసం బండి సంజయ్, కిషన్​రెడ్డిలు ప్రధానిని నిలదీయాలి

by velandi.Saikiran |

యూరియా కోసం బండి సంజయ్, కిషన్​రెడ్డిలు ప్రధానిని నిలదీయాలి
X

యూరియా కోసం బండి సంజయ్, కిషన్​రెడ్డిలు ప్రధానిని నిలదీయాలి: కాంగ్రెస్​ఎమ్మెల్యే విజయ రమణారావు

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డికి దమ్ముంటే యూరియా కోసం ప్రధానిని నిలదీయాలని కాంగ్రెస్​ ఎమ్మెల్యే విజయ రమణారావు డిమాండ్​చేశారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు 8 మంది నోరుమూసుకొని ఉన్నారని, ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర బీజేపీ నాయకులు ధర్నా చేయాలని చెప్పారు. సోమవారం హైదరాబాద్​లోని సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయ రమణారావు మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కుమ్మక్కై మా ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులను బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడుతున్నారన్నారు. సోషల్ మీడియాలో ప్రచారం కోసం యూరియా బస్తా పేరుతో డ్రామాలు ఆడుతున్నారని, బీఆర్ఎస్ నాయకులు ఎందుకు కేంద్రాన్ని, బీజేపీ నాయకులను ఎందుకు నిలదీయడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తే ఇప్పటి వరకు 5.32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయ్యిందని, 2.69 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఏర్పండిందన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, ఏపీ, బీహార్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా యూరియా కొరత ఉందన్నారు. రాష్ట్రంలో రైతుల కష్టాలకు బీజేపీదే బాధ్యత అని విజయ రమణారావు మండిపడ్డారు.

యూరియా విషయంలో కేంద్రం కుట్ర చేస్తోంది : కాంగ్రెస్​ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్

యూరియా విషయంలో కేంద్రం ప్రభుత్వం కుట్ర చేస్తోందని కాంగ్రెస్​ఎమ్మెల్యే మక్కన్​సింగ్​రాజ్​ఠాకూర్​ఆరోపించారు. సోమవారం హైదరాబాద్ లోని సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత ఆర్ఎఫ్ సీఎల్ ను ప్రైవేట్ కంపెనీ కి ఇచ్చారని, ఇప్పుడు రాష్ట్రానికి ఆర్ఎఫ్ సీఎల్ నుండి రావాల్సిన వాటా కేవలం 15శాతం మాత్రమే ఇప్పటి వరకు వచ్చిందన్నారు. మా పాలనలో రాష్ట్రానికి యూరియా ఉండాలని ఆర్ఎఫ్​సీఎల్​నిర్మాణం చేపట్టామన్నారు. మా రాష్ట్రానికి అన్యాయం చేయకండి మా ఆర్ఎఫ్ సీఎల్​లో ప్రాబ్లం ఎందుకు వస్తుందనీ మోడీని బీజేపీ ఎంపీలు అడగాలని ఆయన డిమాండ్​చేశారు. రాష్ట్రం నుండి ఆర్ఎఫ్ సీఎల్ లో 11 శాతం షేర్ ఉన్న రాష్ట్రానికి ఇవ్వాల్సిన లాభాలు కానీ, షేర్ లు కానీ ఇవ్వడం లేదని రాజ్​ఠాకూర్ విమర్శించారు. ఆర్ఎఫ్ సీఎల్ విషయంలో ఆ ప్రైవేట్ కంపేనీపై సీబీఐ విచారణ జరపాలని రాజ్​ఠాకూర్​ డిమాండ్​ చేశారు.

‌‌‌‌‌

Next Story