- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Congress: స్థానిక ఎన్నికలపై మీనాక్షి ఫోకస్.. గాంధీ భవన్‌లో వరుస భేటీలు
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్‌గా ముందుకు సాగుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్‌గా ముందుకు సాగుతున్నారు. తెలంగాణ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన నుంచి మీనాక్షి తనదైన శైలిలో అడుగులు వేస్తున్నారు. పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు వ్యూహాత్మకంగా వెళుతున్నారు. దీనిలో భాగంగానే నేతలతో వరుసగా భేటీలకు ప్లాన్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతోనే ఆమె స్థానిక సంస్థలపై దృష్టి సారించారు. మంగళవారం గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన మెదక్, మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా సమీక్ష జరిపారు. ఏఐసీసీ సెక్రెటరీ విష్ణునాథ్, మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, నేతలతో కలిసి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మీనాక్షి.. నియోజకవర్గాలలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, పోటీ చేసిన అభ్యర్థులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాలు చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, ఇతర లీడర్ల నుంచి స్వయంగా అభిప్రాయాలను తీసుకున్నారు.
ప్రభుత్వం మారినా బీఆర్ఎస్ నేతలదే పవర్
కాంగ్రెస్ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బీఆర్ఎస్ నేతలే ఇంకా అధికారం చలాయిస్తున్నారని కొందరు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గాలలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు లేకపోవడం, కనీసం అధికారులు సైతం తమ మాట వినడం లేదని మరికొందరు లీడర్లు మీనాక్షి దృష్టికి తెచ్చారు. కనీసం ఇందిరమ్మ ఇల్లు అయిన తాము చెప్పిన వారికి ఇస్తే గౌరవం ఉంటుందని పలువురు నేతలు తెలిపారు.
పార్టీ వ్యవహారాలు బయటకొస్తే వేటు..
కాంగ్రెస్ పా ర్టీ అంతర్గత విషయాలు బయటకు మాట్లాడితే వేటు తప్పదని నటరాజన్ హెచ్చరించారు. ముఖ్యంగా సొంత పార్టీ నేతలు సోషల్‌మీడియా వేదిక విమర్శలు చేసుకోవద్దన్నారు. ఎక్కడైనా నియోజకవర్గ ఇన్‌చార్జి వల్లే సమస్యలు వస్తే పదవి నుంచి తొలగిస్తామని ఖరాఖండిగా చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారి వివరాలు తానే స్వయంగా తెప్పించుకుంటున్నానని, నియోజకవర్గ ఇన్‌చార్జీలు బాధ్యతతో పని చేయాలని సూచించారు.
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలపై ఆరా..
ముఖ్యంగా గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలపై మీనాక్షి ఆరా తీశారు. ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వచ్చాయి? ఎందుకు వెనుకబడాల్సి వచ్చింది..అక్కడ ఉన్న సమస్యలు ఏమిటన్న దానిపై అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతానికి అధికారంలో ఉన్నాం.. ఇప్పుడు ఆయా నియోజకవర్గాలలో పార్టీ మెరుగుపడిందా? లేదా అనే అంశాలపై కిందిస్థాయికి వెళ్లి పరిశీలించాలని నేతలకు సూచించారు. పార్టీలో నేతల పనితీరును కూడా అడిగి తెలుసుకున్నారు.
లిమిట్స్ క్రాస్ చేస్తే యాక్షన్..
పార్టీలో కొందరి తీరుతో నెలకొన్న అసంతృప్తి, ఇతర సమస్యలు, ఇబ్బందులను మీనాక్షి దృష్టికి తీసుకొచ్చారు. ఏండ్లుగా పార్టీ జెండా పట్టుకొని తిరుగుతున్న తమకు గుర్తింపు లేదని మీనాక్షి ముందర తెలిపారు. దీనికి స్పందించిన ఆమె ఇకపై పార్టీలో అలా ఉండదని, కష్టపడ్డ వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని చెప్పుకొచ్చారు. పార్టీలో ఎవరేంటన్నది వారి బయోడేటా తెప్పించుకుంటున్నామన్నారు. పార్టీలో ఎవరెవరీకి పదవులు ఇవ్వాలనే దానిపై పరిశీలన చేస్తున్నామని స్పష్టం చేశారు. పార్టీ నిబంధనలకు లోబడే పనిచేయాలని, ఎవరైనా లిమిట్స్ క్రాస్ చేస్తే తప్పకుండా యాక్షన్ ఉంటుందని ఆమె స్వీట్‌గానే వార్నింగ్ ఇచ్చారు.
స్థానిక సంస్థల్లో సత్తాచాటాలి..
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు మీనాక్షి దిశానిర్దేశం చేశారు. లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగిరేలా నేతలు, కార్యకర్తలు శ్రమించాలన్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్నాం.. కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల ప్రజాపాలనలో పార్లమెంటు సెగ్మెంట్ల పరిధిలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. లీడర్లంతా విభేదాలు పక్కనపెట్టి కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్టీలో పాత, కొత్త నేతల మధ్య సమన్వయం లోపించకుండా ఐక్యతతో ముందుకెళ్లాలన్నారు. నేతలు తమ నియోజకవర్గాలలో ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. జై భీం, జై భారత్, జై సంవిథాన్ కార్యక్రమాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నిబంధనలకు అనుగుణంగా, పెద్దలు సూచనల మేరకు ముందుకెళ్తామి మీనాక్షి హామీనిచ్చారు.
సైలెంట్‌గా మెదక్, మల్కాజిగిరి సెగ్మెంట్ల రివ్యూ..
గాంధీభవన్‌లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు మెదక్ పార్లమెంటరీ సెగ్మెంట్లోని పటాన్చెరు, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, దుబ్బాక, నర్సాపూర్, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో మీనాక్షి భేటీ అయ్యారు. దాదాపు మూడున్నర గంటలపాటు కొనసాగిన రివ్యూలో నేతలతో స్వయంగా మాట్లాడి వారివారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం ఐదున్నర గంటల తర్వాత మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గమైన, మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపుర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని నేతలతో భేటీ జరిగింది. ఆయా సమీక్షల్లో నేతలు ఎలాంటి ఘర్షణలు, దూషణాలకు తావివ్వకుండా పాల్గొన్నారు. మీనాక్షి విధానమేమిటో ముందు తెలియజేయడంతో నేతలంతా సైలెన్స్‌గానే సమీక్షలో పాలుపంచుకున్నారు.
మీనాక్షి ముందు ‘కాటా’ ఆవేదన..
మీనాక్షి నటరాజన్ ముందుర పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పవర్‌లో లేనప్పటికీ పార్టీ కోసం కష్టపడుతూ వస్తు్న్నానని, భూములు అమ్ముకొని పార్టీ కోసం నిలబడ్డానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల వేళ గెలిచే సమయంలో తనకు టికెట్ ఇవ్వకుండా, అన్యాయం చేశారని ఆవేదన చెందారు. అయినా పార్టీ కోసం పాటుపడుతూ వస్తున్నానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తనను చాలా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో చేరిన మహిపాల్ కనీసం కాంగ్రెస్ అగ్రనేతలు, సీఎం ఫొటోలు పెట్టకుండా ఇష్టారీతినా వ్యహరిస్తున్నారని చెప్పారు. ఈ విషయంలోనే గొడవ జరిగిందని, సమస్య పరిష్కారం కోసం కమిటీ వేసినా ఇప్పటి వరకు ఎలాంటి రిపోర్టు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని ఇన్‌చార్జిని కోరారు. కాటాకు మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ మద్దతుగా నిలిచారు. వారు సైతం కాటాకు అన్యాయం జరిగిందని మీనాక్షికి తెలియజేశారు. దీంతో నటరాజన్ సానుకూలంగా స్పందించారు.






