వక్ఫ్ బోర్డుపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం: షబ్బీర్ అలీ

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-17 17:24:57  IST  )

వక్ఫ్ బోర్డుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు.

వక్ఫ్ బోర్డుపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం: షబ్బీర్ అలీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: వక్ఫ్ బోర్డుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. గురువారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సవరించిన వక్ఫ్ బోర్డు బిల్లును తాము సుప్రీంకోర్టులో సవాల్ చేశామని గుర్తుచేశారు. రాజ్యాంగం మీద ముస్లింలకు నమ్మకం ఉందని, మా తరపున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ వాదించారని ఆయన పేర్కొన్నారు. కబ్జా చేసిన భూములన్నింటికీ ఒకే చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం ఒక మతానికి మాత్రమే చట్టం చేస్తే ఎలా చేస్తారు? అని ఆయన ప్రశ్నించారు.

వక్ఫ్ భూములు ప్రభుత్వమిచ్చినవి కావని, దాతలు పేద ముస్లింలకు చెందాలని ఇచ్చారని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డులో మహిళలు కూడా ఉన్నారని, తెలంగాణ, ఏపీ లోనూ మహిళా సభ్యులు ఉన్నారని ఆయన తెలిపారు. అన్ని మతాల దేవాలయాల భూములు కూడా కబ్జాకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని మతాల భూముల కబ్జాలపై ప్రభుత్వం ఒకే చట్టం తీసుకువస్తే తాము స్వాగతిస్తామని అన్నారు. వేర్వేరు మతాల వారిని బోర్డులో నియమించడం వల్ల గొడవలు జరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. వక్ఫ్ బోర్డు భూముల పరిరక్షణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story