పార్టీ మారాలని నిర్ణయించుకున్నా.. తెగేసి చెప్పిన జీవన్ రెడ్డి

by Gantepaka Srikanth |

పార్టీ మార్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కుండబద్దలు కొట్టారు.

పార్టీ మారాలని నిర్ణయించుకున్నా.. తెగేసి చెప్పిన జీవన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ మార్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీని వీడటం ఖాయం. ఆల్రెడీ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాను. రెండు, మూడు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తా. మెజార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ పార్టీని వీడితేనే మంచిదని చెప్పారు. వారి సూచనలు, అభిప్రాయాలను గౌరవిస్తా. జగిత్యాల సభలో నిర్ణయం ప్రకటిస్తా’ అని జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో పార్టీకి కీలకంగా ఉన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తారనే వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నెల 25న ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నట్లు వినిపిస్తున్న సమాచారంతో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో విభేదాలు..

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం, నియోజకవర్గ నిర్ణయాల్లో జీవన్ రెడ్డిని పక్కన పెట్టడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన జగిత్యాల మున్సిపల్ ఎన్నికల అనంతరం చైర్మన్ పదవి ఎంపికలోనూ తన వర్గానికి అన్యాయం జరిగిందని ఆయన భావిస్తున్నారు. "పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన మాకు గుర్తింపు లేనప్పుడు ఇక్కడ ఉండలేను" అని ఆయన తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆయన నివాసం 'ఇందిరా భవన్' వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీని వీడితే కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది. 40 ఏళ్ల అనుబంధం ఉన్న నేత వెళ్లిపోతే, పార్టీని నమ్ముకున్న కిందిస్థాయి కార్యకర్తల్లో స్థైర్యం దెబ్బతింటుంది. మరోవైపు, జీవన్ రెడ్డి చేరిక బీఆర్ఎస్‌కు ఉత్తర తెలంగాణలో కొత్త ఊపిరి పోస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story