పొత్తులపై అధిష్టానానిదే తుది నిర్ణయం.. తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన జానారెడ్డి

by Disha Web Desk 2 |
పొత్తులపై అధిష్టానానిదే తుది నిర్ణయం.. తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన జానారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: అధికార బీఆర్ఎస్ పార్టీతో పొత్తు గురించి ఇప్పుడే చెప్పలేమని, ఎన్నికలప్పుడు ప్రజలు నిర్ణయిస్తారని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జానారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేకంగా తమ పార్టీ కొట్లాడుతూ ఉన్నదని, ఈ పోరాటానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధం లేదని చెప్తూనే బీఆర్ఎస్ పార్టీతో పొత్తు గురించి ఇప్పుడే ఏదీ చెప్పలేమని, ఎన్నికల సమయ,లో ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీపై లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేయడాన్ని బీఆర్ఎస్ సహా పలు బీజేపీ వ్యతిరేక పార్టీలు ఖండించాయని, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి మద్దతు పలికాయని, సంతోషంగా ఉందని, ఈ స్నేహం ఇకపైన కూడా కొనసాగాలని కోరుకుంటున్నానని అన్నారు.

మోడీ పాలనపై ప్రజలు గొంతు విప్పాల్సిన సమయం ఆసన్నమైందని, బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలన్నారు. ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని రాహుల్‌గాంధీ మొదలు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ థాక్రే వరకు నొక్కిచెప్తున్నా జానారెడ్డి మాత్రం దానికి భిన్నంగా ఎన్నికలప్పుడు ప్రజలు నిర్ణయిస్తారంటూ వ్యాఖ్యానించడం పార్టీలో చర్చకు దారితీసింది. వరంగల్ డిక్లరేషన్ సభలోనూ, ఆ తర్వాత భారత్ జోడో యాత్ర సందర్భంగానూ రాహుల్‌గాంధీ సూటిగానే బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని చెప్పినా జానారెడ్డి మాత్రం తనదైన శైలిలో వ్యాఖ్యానించడం గమనార్హం.

జానారెడ్డి తన నివాసంలో ఉదయం జరిగిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు పార్టీలోనూ, రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారడంతో సాయంత్రానికి క్లారిటీ ఇస్తూ ప్రకటన విడుదల చేశారు. “మీడియా ప్రతినిధులు పొత్తులపై ప్రస్తావించినపుడు నేను క్లుప్తంగా మాట్లాడాను. ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీకి వ్యతిరేకంగా 17 రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి పోరాటం చేస్తున్నాయని, ఆ అంశాన్ని స్వాగతిస్తున్నానని మాత్రమే చెప్పాను. నేను బీఆర్ఎస్‌తో పొత్తు ఉంటుందని చెప్పలేదు. పొత్తుల విషయం అధిష్టానం నిర్ణయం మేరకు ఉంటుంది. అధిష్టానం నిర్ణయమే మాకు శిరోధార్యం..” అంటూ సవరించుకున్నారు. పార్టీ శ్రేణుల్లోనూ తప్పుడు మెసేజ్ వెళ్ళిందన్న ఉద్దేశంతో జానారెడ్డి ఈ స్పష్టతను మీడియా ప్రకటన ద్వారా ఇచ్చుకోక తప్పలేదు.

ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదంటూ కాంగ్రెస్ స్పష్టమైన విధానా నిర్ణయాన్ని తీసుకున్న సంగతి జానారెడ్డికి తెలిసినా ‘ఎన్నికలప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు’ అని చెప్పడాన్ని సొంత పార్టీ నేతలు కూడా తప్పుపట్టారు. ఒకవైపు కాంగ్రెస్‌తో కలిసి ఢిల్లీలో వివిధ కార్యక్రమాల్లో, అఖిలపక్ష నేతల సమావేశాల్లో బీఆర్ఎస్ పాల్గొంటూ దగ్గరవుతున్నదనే సందేహాలు నెలకొన్న సమయంలో జానారెడ్డి మీడియా సమక్షంలో పై వ్యాఖ్యలు చేయడం సొంత పార్టీలో దుమారం లేపింది. పార్టీ విధానం స్పష్టంగా తెలిసినా పొత్తుపై సూటిగా చెప్పకుండా ఎన్నికలప్పుడు.. అంటూ దాటవేత ధోరణితో వ్యవహరించడం వివాదానికి దారితీసింది. అప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ‘హాథ్ సే హాథ జోడో యాత్ర’లో పొత్తులపై స్పష్టత ఇచ్చారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

పార్టీ విధానం స్పష్టంగా ఉన్నా గతంలో ఎంపీ కోమటిరెడ్డి సైతం ఢిల్లీలో మీడియా సమావేశంలో.. రాష్ట్రంలో హంగ్ వచ్చే అవకాశమున్నదని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, బీఆర్ఎస్ కలవక తప్పదంటూ కామెంట్ చేశారు. దీనిపై కూడా పార్టీ అగ్రనాయకత్వం సీరియస్ అయింది. ఆ తర్వాత కోమటిరెడ్డి తన వ్యాఖ్యలపై సవరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు జానారెడ్డి సైతం అదే తీరులో తొలుత మాట జారి ఆ తర్వాత సాయంత్రానికి ప్రకటన ద్వారా వివరణ ఇచ్చుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక తాను ముక్కలే అంటూ బీజేపీ విమర్శలు చేస్తున్న సమయంలో జానారెడ్డి వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లోనే చర్చ చోటుచేసుకున్నది.

Next Story

Most Viewed