Minister Sridhar Babu : దళితుల అభివృద్ధికి కృషి చేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమే : మంత్రి శ్రీధర్ బాబు

by Muthe.Rajitha |   (  Updated:2025-02-28 14:39:14  IST  )

తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో మహిళల కోసం మినీ ఇండస్ట్రియల్ పార్కు(Miny Industrial Park for Women)ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) పేర్కొన్నారు.

Minister Sridhar Babu : దళితుల అభివృద్ధికి కృషి చేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమే : మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతి అసెంబ్లీ నియోజకర్గంలో మినీ ఇండస్ట్రీయల్ పార్కును మహిళల కోసం అభివృద్ధి చేస్తామని, ఈ పార్కుల్లో ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు 10 శాతం ప్రత్యేకంగా కేటాయిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఎఫ్ టీసీసీఐ భవన్ లో శుక్రవారం ఎస్సీ, ఎస్టీశాసనసభ్యులు, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఎంటర్ ప్రైజెస్ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎంఎస్ఎంఈ(ఎంఎస్ఎంఈ) 2024: ఎ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టూ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీలు ఎదిగితేనే ఈ సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ లో దళితులకిచ్చిన ప్రతి హామీని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నేరవేరుస్తుం దన్నారు. కాంగ్రెస్ అంటేనే దళితులు.. దళితులు అంటేనే కాంగ్రెస్ అని దళితుల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 2017 నుంచి సబ్సిడీల కింద పారిశ్రామికవేత్తలకు అందాల్సిన బకాయిలు రూ.4500 కోట్లకు పైగా ఉన్నాయన్నారు.

వీటిలో రూ.2200 కోట్లు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకే రావాలని చెప్పారు. మేం అధికారంలోకి రాగానే ఈ బకాయిల చెల్లింపుపై దృష్టి సారించామని మార్చి చివరి నాటికి రూ.300 కోట్లు చెల్లించనున్నట్టు వెల్లడించారు. ఓవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూనే.. మరోవైపు సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించామన్నారు. దేశంలో ఎక్కువ మంది కార్మికులు ఎంఎస్ఎంఈ రంగంలోనే ఉపాధి పొందుతున్నారని, దురదృష్టవశాత్తు ఇప్పటీ వరకూ ఎంఎస్ఎంఈలకు ప్రత్యేకంగా పాలసీ అంటూ ఏదీ లేదన్నారు. రాహుల్ గాంధీ సూచనల మేరకు మేం ప్రత్యేకంగా పాలసీని తీసుకొచ్చామని, క్షేత్రస్థాయిలో శాస్త్రీయంగా అధ్యయనం చేసి.. నిపుణులను భాగస్వామ్యం చేసి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ పాలసీని రూపొందించామన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోరిక మేరకు.. వారికి మరింత ప్రయోజనం చేకూరేలా పాలసీ ఆపరేషనల్ గైడ్ లైన్స్ ను తయారు చేయనున్నట్టు తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటాం

ప్రొక్యూర్ మెంట్, కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం కల్పించేందుకు కృషి చేస్తామని మంత్రి వెల్లడించారు. శాస్త్రీయంగా అధ్యయనం చేసి ప్రత్యేక పాలసీలను తీసుకొస్తామని, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పరిశ్రమల స్థాపనలో వారికి ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తామని చెప్పార. స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేసి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యమున్న మానవ వనరులను అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. బ్యాంక్ ల నుంచి రుణాలు పొందటంలో ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. . కుటీర పరిశ్రమలకు ప్రోత్సహించేందుకు చర్యలు చేపడతామన్నారు.

ఈ ఏడాది ఏప్రిల్ మెుదటి వరాంలో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు, అధికారులతో కూడిన ప్రత్యేక బృందం తమిళనాడు, కర్ణాటకలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తుందన్నారు. ఆయా ప్రభుత్వాలు దళిత పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహాకాలపై ప్రత్యేకంగా అధ్యయనం చేసి, ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం దళిత పారిశ్రామికవేత్తలకు మరింత ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణరావు, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్, కడియం శ్రీహరి, రాంచందర్ నాయక్, మందుల సామెల్, వెడ్మ భోజ్జు, నాగరాజు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Next Story