కామారెడ్డి డిక్లరేషన్‌కు కాంగ్రెస్ కట్టుబడి ఉంది.. మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

కామారెడ్డి సాక్షిగా చేసిన బీసీ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు.

కామారెడ్డి డిక్లరేషన్‌కు కాంగ్రెస్ కట్టుబడి ఉంది.. మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కామారెడ్డి సాక్షిగా చేసిన బీసీ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. ఇవాళ నగరంలోని గాంధీ భవన్‌లో టీపీపీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. టీపిసిసి అధ్యక్షుడిగా విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న మహేష్ కుమార్ గౌడ్‌కు ఆమె ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. తాను పార్టీ ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించడం శుభ పరిణామమని అన్నారు. వచ్చే విస్తృత స్థాయి సమావేశాలు జిల్లాల్లో నిర్వహించేలా ప్లాన్ చేస్తామని పేర్కొన్నారు. ప్రతి కమిటీలో సోషల్ జస్టిస్‌‌కు అనుగుణంగా ఎంపిక ఉంటుందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో 70 నుంచి 80 శాతం పాత వారికి పదవులు ఇచ్చామని, మిగిలిన 20 శాతం కొత్త వారికి అవకాశం కల్పించామని అన్నారు.

తెలంగాణ మోడల్‌ను దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు కష్టతరమైన సరే.. కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని పార్టీ యోచిస్తోందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఓసీ అయినప్పటికీ.. బలహీనవర్గాలకు చెందిన మహేష్ గౌడ్‌తో కలిసి సమన్వయంతో పనిచేస్తూ ముందుకు వెళ్తుండటం అభినందనీయమని కొనియాడారు. 90 శాతం ప్రజలకు ప్రభుత్వ పథకాల లబ్ధి జరుగుతోందని అన్నారు. వచ్చే నెల నుంచి జూబ్లీ‌హిల్స్ ఉప ఎన్నికలపై పూర్తిగా దృష్టి సారిస్తామని అన్నారు. డీసీసీ కమిటీలు వచ్చే వారంలో పూర్తి అవుతాయని తెలిపారు. ఇక గ్రామ స్థాయిలో ‘ఓట్ చోరీ’పై అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామ అధ్యక్షుల ఎంపిక మూడు నెలల్లో పూర్తి చేస్తామని, కామారెడ్డి డిక్లరేషన్‌కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. ఈ నెల 15‌న జరిగే కామారెడ్డి సభను విజయవంతం చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ లీడర్‌షిప్ ప్రోగ్రామ్స్ రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా సాగాయని మీనాక్షి నటరాజన్ తెలిపారు.

Next Story