రాజ్యాంగాన్ని అనేక సార్లు మార్చిన కాంగ్రెస్.. బీజేపీ చీఫ్ ​రాంచందర్​ రావు కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం భారత ప్రజలకు సమానత్వం, న్యాయం, మౌలిక హక్కులు అందించిందని, రాజ్యాంగాన్ని వరుసగా కాంగ్రెస్​ పార్టీ ఉల్లంఘించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు విమర్శించారు.

రాజ్యాంగాన్ని అనేక సార్లు మార్చిన కాంగ్రెస్.. బీజేపీ చీఫ్ ​రాంచందర్​ రావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం భారత ప్రజలకు సమానత్వం, న్యాయం, మౌలిక హక్కులు అందించిందని, రాజ్యాంగాన్ని వరుసగా కాంగ్రెస్​ పార్టీ ఉల్లంఘించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు విమర్శించారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన వర్ధంతి పురస్కరించుకొని చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ 60 సంవత్సరాలు దేశాన్ని పాలించిన సమయంలో రాజ్యాంగాన్ని అనేకసార్లు మార్చే ప్రయత్నం చేసిందని, ఎమర్జెన్సీ విధించి మౌలిక హక్కులను తొక్కిన ఘనత కూడా కాంగ్రెస్‌కే సొంతమని ఎద్దేవా చేశారు.అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వని పార్టీ కాంగ్రెస్ అని, 1955లో నెహ్రూ తర్వాత ఇందిరా గాంధీకి భారతరత్న ఇచ్చినా, రాజ్యాంగ నిర్మాత, నిష్కళంక దేశభక్తుడు అంబేద్కర్ కు దేశ అత్యున్నత పురస్కారం ఇచ్చే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు.

భారత రాజ్యాంగానికి, సామాజిక న్యాయ సంస్కరణలకు అంబేద్కర్ అసమానమైన కృషి చేసినప్పటికీ, కాంగ్రెస్ ఆయనకు దక్కాల్సిన గుర్తింపును ఇవ్వలేదన్నారు. 1990లో బీజేపీ మద్దతుతో ఆయన మరణానంతరం భారతరత్న లభించింది. వారి స్మారకాలను ‘పంచతీర్థాలు’గా నిలిపిన ఘనత ప్రధాని మోడీ ప్రభుత్వానిదేనని విశ్వవ్యాప్తంగా గౌరవించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. మహూలో భారీ స్మారక నిర్మాణం, నాగ్‌పూర్‌లో వారి జీవితానికి సంబంధించిన క్షేత్ర అభివృద్ధి, ముంబైలో స్మారక ప్రాజెక్టు, లండన్‌లో చదువుకున్న ఇంటిని భారత ప్రభుత్వం కొనుగోలు చేసి మెరుగైన లైబ్రరీగా ఏర్పాటు చేసిందన్నారు. దళిత-బీసీ వర్గాల కోసం పోరాడేది బీజేపీ, మాటలు చెప్పేది కాంగ్రెస్. అంబేద్కర్ సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడారు. అదే స్ఫూర్తితో బిజెపి బడుగు-బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడుతుందని చెప్పారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ చేసి ప్రజలను మోసం చేసిందన్నారు.

బీసీలకు అన్యాయం జరుగుతుందని బాధపడి బీసీ యువకుడు ఈశ్వర్ చారి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన చాలా బాధాకరమన్నారు. యువత రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలను, అన్యాయంపై పోరాడాలని, ప్రాణాలు తీసుకోవద్దు. బతికి పోరాడితేనే మార్పు తేవచ్చు. చావు కాదు, చైతన్యమే సమాజాన్ని మార్చుతుందన్నారు. అంబేద్కర్ ఆలోచనలు - దేశానికి శాశ్వత దిక్సూచి. దేశవ్యాప్తంగా ప్రతి పేద–బలహీన వర్గాల ప్రజలకు నాయకుడు. వారి ఆలోచనలను అనుసరించే బాధ్యత మనందరిపై ఉందన్నారు.

Next Story