- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గతంకంటే బాగా పుంజుకున్న కాంగ్రెస్.. బీజేపీ ఎమ్మెల్యేల ఇలాఖాల్లో హవా
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణలో గతంకంటే బాగా పుంజుకున్నది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మించి భారీ విజయాన్ని నమోదు చేసుకున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణలో గతంకంటే బాగా పుంజుకున్నది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మించి భారీ విజయాన్ని నమోదు చేసుకున్నది. నాలుగు కార్పొరేషన్లకు గాను రామగుండం, మంచిర్యాలలో ఘనవిజయం సాధించింది. మిగిలిన నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలోనూ గణనీయంగా డివిజన్లను గెలుచుకున్నది. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి నియోజకవర్గంలోని కీలకమైన నిర్మల్ మున్సిపాలిటీలో గెలిచింది. మరో కీలకమైన నిజామాబాద్ కార్పొరేషన్‌లో పాగా వేసేందుకు హస్తం పార్టీ పావులు కదుపుతున్నది. నిజామాబాద్ కాంగ్రెస్ వశం కాబోతున్నదని రాజకీయ వర్గాల్లోనూ ప్రచారం జరుగుతున్నది. ఇక్కడ 60 డివిజన్లకు కాంగ్రెస్ 17 డివిజన్లు గెలిచింది. ఆదిలాబాద్‌లో నిర్మల్, లక్సెట్టిపేట్, చెన్నూర్‌లో విజయం సాధించింది. ఆదిలాబాద్, బెల్లంపల్లి, ఖానాపూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లో హంగ్ వచ్చింది. గతంలో ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ విజయాలు అంతంతమాత్రంగానే ఉన్నా ఈసారి గణనీయ సంఖ్యలో మున్సిపాలిటీలను గెలుపొందింది.
హంగ్ వచ్చినా పీఠం వశం..
నిజామాబాద్ జిల్లాలో ఏడు మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ ఐదు చోట్ల విజయం సాధించింది. కామారెడ్డి, బోధన్‌లో హంగ్ వచ్చింది. బోధన్ 38 స్థానాలకు కాంగ్రెస్ 17 గెలిచింది. ఇక్కడ ఎమ్మెల్యే ఉండటం, ఎంఐఎంకు 12 స్థానాలు రావడంతో ఇక్కడ పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నది. కామారెడ్డిలో 49 సీట్లకు కాంగ్రెస్ 19 గెలిచింది. ఉమ్మడి కరీనగర్ జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ మెజార్టీ సాధించగా, జగిత్యాల, వేములవాడలో మెజార్టీ సీట్లు గెలిచినా హంగ్ వచ్చింది. వేములవాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండటంతో చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడం సులభమని, జగిత్యాల కూడా కాంగ్రెస్ ఖాతాలో పడుతుందని, ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ వర్గాలను సమన్వయం చేసుకోవాల్సి ఉందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్‌లో 66 డివిజన్లకు కాంగ్రెస్ 14 డివిజన్లు గెలిచి సత్తా చాటింది.
‘గ్రేటర్’ పరిధిలో నిరాశే!..
దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ దాదాపుగా పెద్ద సంఖ్యలో మున్సిపాలిటీలను గెలుచుకున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిసర మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌కు ఆశించిన స్థాయిలో మున్సిపాలిటీలు దక్కలేదు. సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండటం, ఆ పార్టీ అగ్రనేతలు సైతం అక్కడే ఫోకస్ చేయడంతో బీఆర్ఎస్‌కే ఎక్కువ మున్సిపల్ వార్డులు వచ్చాయి. ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా పార్టీ ఓడిపోయింది. మొయినాబాద్‌లో 26 వార్డులకు 10 వార్డులు, శంకర్‌పల్లిలో 15 వార్డులకు 9, ఆలియాబాద్‌లో 20వార్డులకు 8, మూడుచింతలపల్లిలో 24 వార్డులకు 9, ఎల్లంపేట్‌లో 24 వార్డులకు 8, ఇస్నాపూర్‌లో 26 వార్డులకు 10, గడ్డపోతారంలో 18 వార్డులకు 3, ఇంద్రేశంలో 18 వార్డులకు 6 వార్డులు కాంగ్రెస్ గెల్చుకున్నది. ప్రధానంగా గ్రేటర్ పరిసర ప్రాంతాలైన సంగారెడ్డి, సదాశివపేట్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అక్కడ పార్టీని గెలిపించారు.
ఎమ్మెల్యేలు ఉన్నచోటా ఓటమి..
పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నచోట కూడా కాంగ్రెస్ ఓడిపోవడం పార్టీ శ్రేణుల్ని నిరాశకు గురిచేసింది. ప్రధానంగా ఇబ్రహీంపట్నం, తొర్రూర్ (పాలకుర్తి), తిరుమలగిరి(తుంగతుర్తి), ఆమనగల్లు(కల్వకుర్తి)లో పార్టీ మున్సిపాలిటీలను ఓడిపోయింది. కాగా, హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లో నారాయణపేట్, మెదక్, ఖానాపూర్, పరిగి, బెల్లంపల్లి, చెన్నూర్ (క్యాతన్‌పల్లి) వర్ధన్నపేట, వేములవాడ, మహబూబాబాద్‌తోపాటు అదే నియోజకవర్గానికి చెందిన కేసముద్రం మున్సిపాలిటీ, మరికొన్నిచోట్ల అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఆయా ఎమ్మెల్యేల పనితీరు, అక్కడి స్థానిక పరిస్థితులపై పార్టీ సమీక్ష చేయనుందని పార్టీ నేతలు చెబుతున్నారు.






