- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొహెడ ఫ్రూట్ మార్కెట్ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర : మాజీ మంత్రి హరీశ్ రావు
కొహెడలో ఫ్రూట్ మార్కెట్ కోసం కేటాయించిన 200 ఎకరాల భూమిని అడ్డ దారిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట నియోజకవర్గం ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు.

దిశ, తుర్కయంజాల్ : కొహెడలో ఫ్రూట్ మార్కెట్ కోసం కేటాయించిన 200 ఎకరాల భూమిని అడ్డ దారిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట నియోజకవర్గం ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. సోమవారం ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని కొహెడలో ఫ్రూట్ మార్కెట్ కు కేటాయించిన స్థలంలో బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కొహెడ ఫ్రూట్ మార్కెట్ పరిరక్షణ, భూ బాధితుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఫ్రూట్ మార్కెట్ భూములను పరిశీలించారు. ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు హాజరై మాట్లాడారు. ఎల్బీనగర్ లో గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్లో ట్రాఫిక్ ఇబ్బందులను, పొల్యూషన్, ప్రజల ఆరోగ్యాలను, రైతుల శ్రేయస్సు కోసం, భవిష్యత్తులో అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొహెడ లో 200 ఎకరాలలో అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ నిర్మించాలని గతంలో కేసీ ఆర్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
అయితే ఈ భూమి సేకరణలో భాగంగా మార్కెటింగ్ శాఖ ద్వారా సాగులో ఉన్న రైతులకు రూ.10 కోట్ల నష్టపరిహారం అందజేయడం జరిగిందన్నారు. 2020లో జీఓ 11 ఫ్రూట్ మార్కెట్ ను నోటిఫై చేస్తూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి జీఓ విడుదల చేశారని తెలిపారు. ఈ మార్కెట్ నిర్మాణానికి మార్కెటింగ్ శాఖ ద్వారా రూ. 350 కోట్ల నుబ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ మార్కెట్ ను అనుసంధానం చేస్తూ ఫిష్, పూలు, కోల్డ్ స్టోరేజ్, రైతులకు విశ్రాంతి గదులు, విదేశాలకు వెళ్లే పండ్లు ప్యాకింగ్ వంటి అంశాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో వెయ్యి కోట్ల రూపాయలతో డీపీఆర్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మార్కెట్ నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాల్సింది పోయి.. మార్కెట్ భూమిని అడ్డ దారిన అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మూడు వేల కోట్ల రూపాయల విలువ గల భూమిని సీఎం రేవంత్ రెడ్డి టీజీఐఐసీ ఇచ్చి అక్కడ నుంచి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి అయి ఉండి దళారుల కోసమో వ్యాపారుల కోసమో పని చేయకూడదనీ, రాష్ట్రం లో ఉండే లక్షలాది మంది పండ్లు పండించే రైతుల కోసం కృషి చేయాలన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ హౌసింగ్ సొసైటీ (దిల్) భూమిలో జనాభా ప్రాతిపదికన తమ వాటా తమకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారని, తెలంగాణ హై కోర్టులో కేసు వేశారన్నారు. ఈ కేసు లో థర్డ్ పార్టీ కి భూములు కేటాయించవద్దని హై కోర్టు ఆర్డర్ జారీ చేసిందనీ, కానీ ముఖ్య మంత్రి తన కమీషన్ల కోసం ఫ్రూట్ మార్కెట్ ను కోహెడలోని ఏపీ హౌసింగ్ సొసైటీ (దిల్) భూమిలోకి మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఎక్కడ భూములు ఖాళీగా ఉంటే వాటిని కాజేయాలని చూస్తుందన్నారు. అన్ని విధాలుగా రెడీగా ఉన్న ఫ్రూట్ మార్కెట్ ను చెట్లు, గుట్టల్లోకి తరలించడం అన్యాయమన్నారు. ఈ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం వల్ల రాష్ట్రంలో వేలాది మంది రైతులు లబ్ధి పొందుతారని, వేలాది మంది జీవనం సాగిస్తారని తెలిపారు. ఈ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్ మార్కెట్ నిర్మిస్తే ఎంతో అభివృద్ధి జరుగుతుందని, ఎంతోమందికి ఉపాధి లభిస్తుందన్నారు. కోర్టు కేసులు ఉన్న భూమి లోకి ఫ్రూట్ మార్కెట్ తరలిస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకునేది లేదన్నారు. రైతుల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ఎంత దూరమైన పోరాటం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇక్కడే ఫ్రూట్ మార్కెట్ నిర్మించే వరకు బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు చేపడుతుందని, స్థానిక రైతులు, నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కోటి ఎకరాలను ప్రొహిబిషన్ లో పెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నారని అన్నారు. పక్కనే ఉన్న రాందాస్ పల్లి గ్రామంలో సర్వే నంబర్ 41 లో 1200 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోహేబిషన్ కింద పెట్టడం జరిగిందన్నారు. దీంతో రైతులు, సాగులో ఉన్న ఎస్సీ, బీసీ లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారన్నారు. ఖాళీగా ఉన్న భూములను ప్రొహబిషన్ కింద పెట్టి సెటిల్మెంట్ లకు పాల్పడుతుందని అన్నారు. ఇప్పటికైనా ప్రొహిబిషన్ లిస్టులో నుంచి రైతుల భూములను తీసివేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడే ఫ్రూట్ మార్కెట్ నిర్మించేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి తో పోరాటం చేసి నిర్మాణం చేయించాలని, అప్పుడే తుమ్మల రైతుల పక్షపాతిగా ఉంటారన్నారన్నారు. ప్రభుత్వానికి కనువిప్పు జరిగేందుకు... ప్రజలకు నిజాలను తెలియజేసేందుకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. దిల్ భూముల్లో సాగులో ఉన్న రైతులకు నష్టపరిహారం వచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, మంచి రెడ్డి ప్రశాంత్ రెడ్డి, నాయకులు సత్తు వెంకట రమణారెడ్డి, దండెం రామ్ రెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.






