- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్కూల్ యూనిఫామ్ ఆర్డర్ రద్దు వెనుక మతలబు ఏంటి? టెస్కో ఆందోళన: కేటీఆర్ ప్రశ్నలు
తెలంగాణ చేనేత సహకార సంఘానికి తెలంగాణ విద్యాశాఖ షాకిచ్చిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ చేనేత సహకార సంఘానికి తెలంగాణ విద్యాశాఖ షాకిచ్చిన విషయం తెలిసిందే. 2026- 27 విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యార్థులకు ఏక రూప దుస్తుల తయారీకి ఇచ్చిన రూ.105.54 కోట్ల ఆర్డర్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చేనేత శాఖకు లేఖ రాసింది. ఇప్పటికే సంక్షేమ శాఖలు రూ.200 కోట్ల విలువైన దుస్తులు, దుప్పట్ల తయారీ కోసం గడువు ముగిసినా ఆర్డర్ ఇవ్వకపోవడంతో టెస్కో ఆందోళన చెందుతోంది. ఈ నిర్ణయంపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఇది ప్రజా ప్రభుత్వమా... లేక 'ప్రైవేట్' లిమిటెడ్ కంపెనీయా? అని మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు సంస్థలకు వత్తాసు పలకడమేనా ప్రజా పాలన? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ టెస్కోకు ఆర్డర్లు రద్దు చేసి ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి రేవంత్ సర్కార్ చేనేత సంఘాల కార్మికుల పొట్ట కొడుతోందని మండిపడ్డారు. రూ.105 కోట్ల విలువ గల స్కూల్ యూనిఫామ్ ఆర్డర్‌ను వెనక్కి తీసుకోవడం వెనుక మతలబు ఏంటి? అని అడిగారు. సంక్షేమ శాఖ నుండి టెస్కోకు దక్కాల్సిన రూ.200 కోట్ల దుస్తులు, దుప్పట్ల ఆర్డర్ ఇంకా ఇవ్వకపోవడం వెనుక కారణం ఏంటి? అని సీరియస్ అయ్యారు. ‘కమీషన్లు దండుకోవాలనే యావలో ప్రైవేట్ వ్యక్తులకు ఆర్డర్లు ఇస్తున్నది కాంగ్రెస్ దండుపాళ్యం ముఠా. నేతన్నల ఉసురు పోసుకుంటున్న కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’ అని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.






