డిసెంబర్ 2027 నాటికి తుమ్మిడిహట్టి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యం: మంత్రి ఉత్తమ్

by Ramesh Naini |   (  Updated:2025-10-07 12:22:53  IST  )

డిసెంబర్ 2027 నాటికి తుమ్మడిహట్టి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యం అని నీటిపారుదల, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

డిసెంబర్ 2027 నాటికి తుమ్మిడిహట్టి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యం: మంత్రి ఉత్తమ్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: డిసెంబర్ 2027 నాటికి తుమ్మిడిహట్టి, ఎస్‌ఎల్‌బీసీ (SLBC) ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యం అని నీటిపారుదల, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంపై అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. మంగళవారం ఆయన అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉన్న తన ఛాంబర్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. డా. బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్, కాళేశ్వరం పథకం కింద ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బారేజీలు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో ఉన్నాయని చెప్పారు.

తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై ఇంజనీరింగ్ బృందాలు రెండు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నాయని వెల్లడించారు. ఒక మార్గంలో మైలారం నుంచి 71.5 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 14 కిలోమీటర్ల టన్నెల్ ద్వారా సుందిళ్లకు నీరు తీసుకెళ్తుందని, మరొక మార్గంలో ఎల్లంపల్లి ద్వారా పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు మార్గాలపై ఖర్చు, భౌగోళిక అనుకూలత, సాంకేతిక సామర్థ్యాల పరంగా నివేదికను అక్టోబర్ 22 లోపు సమర్పించాలని ఆదేశించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టును డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. “ప్రతి పక్షం ప్రగతి సమీక్ష జరుగుతోంది. టన్నెల్ పనుల్లో ఇంజనీర్లు నిర్ణయించిన ప్రమాణాలు తప్పక పాటించాలి” అని ఆయన పేర్కొన్నారు.

మాన్సూన్‌ తర్వాత పనులు వేగవంతం చేస్తామని, ఎన్‌జీఆర్‌ఐ (NGRI) ద్వారా హెలికాప్టర్ ఆధారిత మాగ్నటిక్ సర్వే నిర్వహించేందుకు డీజీసీఏ (DGCA) అనుమతులు త్వరలో వస్తాయని అన్నారు. కాళేశ్వరం పథకం కింద ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బారేజీల పునరుద్ధరణ పనులు ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ప్రకారం జరుగుతున్నాయని ఉత్తమ్ తెలిపారు.

Next Story