కాంగ్రెస్ సర్కార్‌ది 'రియల్ ఎస్టేట్' దందా: పొంగులేటి అక్రమ మైనింగ్‌పై హరీష్ రావు ఫైర్

by Kema Shiva Kumar |

రాజేంద్రనగర్ మానస హిల్స్ ప్రాంతంలో మంత్రి పొంగులేటి సంస్థ 'రాఘవ కన్‌స్ట్రక్షన్స్' సాగిస్తున్న అక్రమ మైనింగ్‌పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ సర్కార్‌ది రియల్ ఎస్టేట్ దందా: పొంగులేటి అక్రమ మైనింగ్‌పై హరీష్ రావు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ మైనింగ్, రియల్ ఎస్టేట్ మాఫియాకు అడ్డాగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజేంద్రనగర్ మానస హిల్స్ ప్రాంతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)కి చెందిన ‘రాఘవ కన్‌స్ట్రక్షన్స్’ ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను పిండి చేస్తూ అక్రమ క్వారీయింగ్ నిర్వహిస్తోందని ఆయన ఆరోపించారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ నిర్వహిస్తున్న క్వారీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (PCB), పర్యావరణ అనుమతులు (EC), మైనింగ్ లీజ్, కనీసం మున్సిపల్, HMDA అనుమతులు కూడా లేవని హరీష్ రావు స్పష్టం చేశారు. విస్ఫోటక పదార్థాల వినియోగానికి ఉండాల్సిన ఎక్స్‌ప్లోజివ్ లైసెన్స్ కూడా లేకుండానే కొండలను మాయం చేస్తున్నారని మండిపడ్డారు.

హైడ్రాపై తీవ్ర విమర్శలు..

పేదల ఇళ్లను కూల్చే హైడ్రా (HYDRAA) బుల్డోజర్లకు, మంత్రులు, వారి బంధువులు చేస్తున్న ఈ భూకబ్జాలు, అక్రమ క్వారీలు ఎందుకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. సామాన్యులకు ఒక న్యాయం, మంత్రులకు ఒక న్యాయమా అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన అల్లుడి అనుయాయులకు ఎలాంటి ఓపెన్ బిడ్డింగ్ లేకుండా 17 ఎకరాల ప్రభుత్వ భూమిని నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో నష్టం వాటిల్లిందని ఆరోపించారు. గనుల శాఖ, పర్యావరణ శాఖ మంత్రులు ఈ అక్రమాలను చూస్తూ ఎందుకు మౌనంగా ఉంటున్నారని, ఇందులో ఎవరెవరికి ఎంత వాటాలు అందుతున్నాయని హరీష్ రావు ప్రశ్నించారు.

మంత్రి పొంగులేటి సంస్థపై తక్షణమే చర్యలు తీసుకుని, అక్రమ క్వారీని మూసివేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు కొల్లగొట్టిన సహజ సంపదను పెనాల్టీతో సహా రికవరీ చేయాలన్నారు. సీఎం అల్లుడి అనుయాయులకు కేటాయించిన 17 ఎకరాల భూమిని రద్దు చేసి, పారదర్శకంగా ఓపెన్ బిడ్డింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు. అక్రమ మైనింగ్‌కు సంబంధించిన ఆధారాలు, ఫోటోలు మీడియా ముందు పెడుతున్నానని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే స్వయంగా తానే వెళ్లి క్షేత్రస్థాయిలో నిజానిజాలు నిగ్గు తేలుస్తానని హరీష్ రావు హెచ్చరించారు.

Next Story