- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరంగల్ ఎయిర్‌పోర్ట్‌పై కాంగ్రెస్ క్రెడిట్ డ్రామా.. రాంచందర్ రావు విమర్శలు
వరంగల్ (మామునూరు) ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు, అభివృద్ధి వెనుక ఉన్న అసలు వాస్తవాలను దాచిపెట్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ క్రెడిట్ అంతా తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించడం హాస్యాస్పదమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: వరంగల్ (మామునూరు) ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు, అభివృద్ధి వెనుక ఉన్న అసలు వాస్తవాలను దాచిపెట్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ క్రెడిట్ అంతా తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించడం హాస్యాస్పదమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. తెలంగాణకు మంచి ప్రాజెక్ట్ వస్తుందంటే అందరికంటే ఎక్కువగా సంతోషించేది బీజేపీ పార్టీయేనని, అయితే ప్రజలకు దీని వెనుక ఉన్న పూర్వాపరాలను, కేంద్ర ప్రభుత్వ కృషిని వివరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర ఆఫీస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్ స్ట్రిప్ అనేది దాదాపు 130 ఏళ్ల క్రితం బ్రిటిష్ కాలంలోనే నిర్మించిన అత్యంత పురాతనమైన, పెద్ద రన్వే అని గుర్తుచేశారు. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో, 2011 లోనే 'రైట్స్' (RITES) సంస్థ ద్వారా దీనికి ఫీజిబిలిటీ నివేదిక వచ్చినప్పటికీ, 2011 నుంచి 2014 వరకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (GMR) కన్సెషన్ అగ్రీమెంట్‌లోని క్లాజ్ 5.2 ప్రకారం 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం రాకూడదనే నిబంధన పెద్ద అడ్డంకిగా మారిందని, గత కేసీఆర్ ప్రభుత్వం కూడా దీనిపై కేవలం ఉత్తరాలకే పరిమితమైందని ధ్వజమెత్తారు.
ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన 'ఉడాన్'
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే వరంగల్ ఎయిర్‌పోర్ట్ కల సాకారమయ్యేందుకు మార్గం సుగమమైందని రాంచందర్ రావు స్పష్టం చేశారు. ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక 'ఉడాన్' (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం ద్వారా దేశంలో విమానాశ్రయాల సంఖ్య 75 నుంచి భారీగా పెరిగిందని, ఇందులో భాగంగానే వరంగల్ ఎయిర్పోర్ట్‌కు ఉన్న 150 కిలోమీటర్ల నిబంధన (వేవర్) క్లియరెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం పట్టుబట్టి సాధించిందని వివరించారు. 2011 నాటి నివేదిక ఆధారంగా దేశంలోని సోలాపూర్, తేజు, పాసిఘాట్, మాల్దా వంటి ఎన్నో ప్రాంతాలలో ఎయిర్‌పోర్ట్‌లు పూర్తయ్యాయని, కేవలం తెలంగాణలో గత ప్రభుత్వాలు భూసేకరణ చేయకపోవడం వల్లే వరంగల్ ప్రాజెక్ట్ ఆలస్యమైందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చి 2028 జూన్ నాటికి ఎయిర్‌పోర్ట్ ప్రారంభిస్తామని 'ఉత్తర కుమార ప్రగల్భాలు' పలుకుతున్నారని, గత కేసీఆర్ ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి మాటలు చెప్పడంలో ఎలాంటి తేడా లేదని విమర్శించారు. వరంగల్‌తో పాటు ఆదిలాబాద్ డిఫెన్స్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా, తక్షణమే భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి 'ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా' (ఏఏఐ)కి అప్పగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వరంగల్ విమానాశ్రయం నిర్మాణానికి పూర్తి సహకారం ఉంటుందని, భవిష్యత్తులో తమ వైఫల్యాలను కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేయవద్దని రేవంత్ రెడ్డి కి రాంచందర్ రావు హితవు పలికారు.






