మేడిగడ్డ చాలదన్నట్టు అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుట్రలా?: కేటీఆర్

by Prasad Jukanti |

అన్నారం బ్యారేజీ వద్ద జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేడిగడ్డ  చాలదన్నట్టు అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుట్రలా?: కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: మేడిగడ్డ బ్యారేజీపై కుట్రలు చేసింది చాలదన్నట్టు ఇప్పుడు అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారా ? అని కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అన్నారం బ్యారేజీ వద్ద లారీల్లో ఇసుక తరలిస్తున్న వీడియోపై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. నిబంధనలకు పాతరేసి ఏకంగా బ్యారేజీ కిందే భారీ ఎక్సవేటర్లతో ఇసుక తవ్వకాలు జరపడం దుర్మార్గమే కాదు.. అతిపెద్ద నేరం. అన్నారు. బ్యారేజీ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న రూల్స్ ను బ్రేక్ చేసిన మాఫియాపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాడ్ చేశారు. ఏకంగా బ్యారేజీని బలహీనపరిచి బీఆర్ఎస్‍పై బురదజల్లే పన్నాగాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. అందినకాడికి దోచుకో.. దొరికినకాడికి అమ్ముకో.. ఇవే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా పాలన సూత్రాలు అని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ వనరుల దోపిడీకి ఇదో ఉదాహరణ:

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ చేస్తున్న అరాచకపర్వాన్ని అన్నదాతలు క్షమించే ప్రసక్తే లేదని నిబంధనలు తుంగలో తొక్కి అన్నారం బ్యారేజి పిల్లర్ల వద్ద ఇసుక తవ్వకాలు చేసి రేవంత్ సర్కార్ బ్యారేజీని ప్రమాదంలోకి నెడుతుందన్నారు. ఇది ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే కుట్రేనని ఆరోపించారు. పట్టపగలే, నిస్సిగ్గుగా అన్నారం బ్యారేజ్ నుండి కాంగ్రెస్ నాయకుల ఇసుక మాఫియా ఇసుకను తోడేస్తోందని ఆరోపించారు. తెలంగాణ వనరులను కాంగ్రెస్ పార్టీ ఎలా కొల్లగొడుతుందో చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ ఇదన్నారు. కాళేశ్వరం బ్యారేజీలకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని, తెలంగాణను నిలువు దోపిడి చేస్తున్న కాంగ్రెస్ నాయకులారా ప్రజలు మీ భరతం పట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది.. ఖబడ్దార్ అని హెచ్చరించారు.

Next Story