బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కుట్ర కనిపిస్తోంది.. కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ.. నేడో, రేపో బీసీ సంక్షేమ శాఖ జీవో విడుదల చేయనుంది.

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కుట్ర కనిపిస్తోంది.. కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ.. నేడో, రేపో బీసీ సంక్షేమ శాఖ జీవో విడుదల చేయనుంది. ఆ జీవో ఆధారంగా పంచాయతీ రాజ్ శాఖ మరో జీవో ఇచ్చి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను అమలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లపై జిల్లా స్థాయి అధికారులు కసరత్తును పూర్తి చేశారు. అయితే, రిజర్వేషన్ల విషయం బయట ఎక్కడ ప్రస్తావించొద్దని.. ఒకవేళ అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు కలెక్టర్లు వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎంపీ కవిత (Kavitha) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన ట్వీట్ చేశారు.

కులగణన సర్వే వివరాలు బయటపెట్టకుండా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వ కుట్ర కనపడుతోందని కామెంట్ చేశారు. తమకు అనుకూలంగా ఉన్న చోట రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు ప్రకటించే లోపే కుల గణన సర్వే వివరాలు వెల్లడించి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. హడావిడిగా ఎన్నికలు నిర్వహించి రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తే బీసీలకు అన్యాయం చేసినట్లేనని.. గ్రామ పంచాయతీల వారీగా కులగణన వివరాలు వెల్లడించాలని అన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం తెలంగాణ జాగృతి మొదటి నుంచి చిత్తశుద్ధితో పని చేస్తోందని.. రిజర్వేషన్ల పెంపు సాధించే వరకు తాము పోరాటం కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు.

Next Story