బీఆర్ఎస్‌కు చెక్ పెట్టిన కాంగ్రెస్.. మైనార్టీ ఓట్లే టార్గెట్‌గా అజార్‌కు మంత్రి పదవి

by Kema Shiva Kumar |

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ నిన్నటి మొన్నటి వరకు గెలుపుపై గంపెడాశలు పెట్టుకున్న బీఆర్ఎస్‌ పార్టీకి కాంగ్రెస్ ఒకరకంగా ఝలక్ ఇచ్చిందనే చెప్పాలి.

బీఆర్ఎస్‌కు చెక్ పెట్టిన కాంగ్రెస్.. మైనార్టీ ఓట్లే టార్గెట్‌గా అజార్‌కు మంత్రి పదవి
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ నిన్నటి మొన్నటి వరకు గెలుపుపై గంపెడాశలు పెట్టుకున్న బీఆర్ఎస్‌ పార్టీకి కాంగ్రెస్ ఒకరకంగా ఝలక్ ఇచ్చిందనే చెప్పాలి. ముస్లింల ఓటు బ్యాంకును నమ్ముకున్న గులాబీ పార్టీ ఆశలకు అధికార పార్టీ తీసుకున్న కీలక నిర్ణయం గండికొట్టిందనే అనాలి. రాష్ట్రవ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే ప్రధానంగా చర్చ నడుస్తున్నది. ఈ క్రమంలో బీఆర్ఎస్‌ కు ఈ ఎన్నిక అత్యంత కీలకంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోకుంటే గులాబీ పార్టీకి మరింత ఇబ్బందికర పరిస్థితులు వచ్చే ప్రమాదం లేకపోలేదు. అందుకోసమే ముందు నుంచీ జూబ్లీహిల్స్‌లో గెలుపు సాధించాలనే లక్ష్యంతో పోరాడుతున్నది. కలిసొచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నది.

ముస్లిం ఓటర్లపై భయం

కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నది. ఇక్కడ గెలిచి బలం పెంచుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది. పార్టీ ఎమ్మెల్సీ అజారుద్దీన్‌ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. దీంతో ఈ నిర్ణయం కాస్త ఇప్పుడు బీఆర్ఎస్ ను గందరగోళంలోకి నెట్టినట్లయింది. నిన్నటిదాకా ముస్లిం ఓటర్లను నమ్ముకుని జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ముందుకు నడుస్తున్నది. అంతేకాకుండా ఇటీవల ముస్లిం లీడర్లు, కేడర్ పెద్దసంఖ్యలో గులాబీ కండువా కప్పుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు 60వేలకు పైగానే ఉన్నాయి. ముఖ్య నేతలకు గాలం వేసే ముస్లింల ఓట్లు తమకే వస్తాయని భావిస్తున్నది. ప్రధానంగా ఆ వర్గం చేరికలపై ఫోకస్ పెట్టింది.

ఈ క్రమంలో హైదరాబాద్ యూత్ కరేజ్ ప్రెసిడెంట్ సల్మాన్ ఖాన్.. కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఆయన నామినేషన్ వేయగా స్క్రూటినీ ప్రక్రియలో సల్మాన్ నామినేషన్ ను ఎలక్షన్ కమిషన్ తిరస్కరించిన నేపథ్యంలో కారెక్కినట్లు తెలిసింది. ఈ సందర్భంగా కేటీఆర్ బీఆర్ఎస్ అధికారంలో ఉండగా, ముస్లిం మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చామని.. కాంగ్రెస్ హయాంలో గుండు సున్నా అని విమర్శలు గుప్పించారు. దీంతో చాలామంది ముస్లింలు మంత్రివర్గంలో తమ వర్గానికి చోటు లేదనే విషయమై కోపంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ తాజా నిర్ణయంతో ముస్లిం ఓటర్లు హస్తం వైపు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో తమ ఓటు బ్యాంకుకు ప్రమాదం లేకపోలేదని గులాబీ శిబిరంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తున్నది. అటు నియోజకవర్గంలో పనిచేస్తున్న కీలక నేతల్లోనూ ఇదే భయాందోళన నెలకొన్నట్లు తెలిసింది.

Next Story