కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల నినాదం.. ఎంపీ రఘునందన్ రావు హాట్ సెటైర్లు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-25 07:27:06  IST  )

బీసీ(BC)లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం తెలంగాణ కేబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్ (Ordinance) చివరకు ఢిల్లీకి చేరింది.

కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల నినాదం.. ఎంపీ రఘునందన్ రావు హాట్ సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీ(BC)లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం తెలంగాణ కేబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్ (Ordinance) చివరకు ఢిల్లీకి చేరింది. మూడు వారాల పాటు ఆర్డినెన్స్‌పై అడ్వకేట్ జనరల్‌తో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Verma) సమగ్రంగా చర్చించారు. గతంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని.. ఆ తీర్పును ‘బీసీ’ ఆర్డినెన్స్‌ ఉల్లంఘిస్తుందా.. లేదా? అని గవర్నర్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన న్యాయ సలహా కోసం ఆర్డినెన్స్‌ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సిఫారసు చేశారు.

అయితే, కాంగ్రెస్ సర్కార్ బీసీ రిజర్వేషన్ నినాదం ఎత్తుకోవడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) ఓ రేంజ్‌లో సెటైర్లు వేశారు. ఇవాళ ఢిల్లీ (Delhi)లో వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని కామెంట్ చేశారు. బీసీపై రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి చిత్తశుద్ధి ఉంటే.. మందుగా తెలంగాణలో అమలు చేసి చూపాలని సవాల్ విసిరారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత పదవిని, తెలంగాణలో ముఖ్యమంత్రి పీఠాన్ని బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్కరినైనా బీసీలను ప్రధాని చేశారా అని ప్రశ్నించారు. తెలంగాణ (Telangana)లో రెడ్డి సమాజికవర్గం శాతం ఎంత.. ఆ కులానికి నాలుగు మంత్రి పదవులు ఎందుకు ఇచ్చారని ఫైర్ అయ్యారు. 10 శాతం కూడా లేని అగ్ర కులాలకు ఏడు మంత్రి పదవులు ఎలా కట్టబెట్టారో రాహుల్ గాంధీ చెప్పాలన్నారు. ఎంతమంది బీసీలను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను చేసిందో చెప్పేందుకు దమ్ముందా అని అన్నారు.

Next Story