కాంగ్రెస్, బీజేపీలది అక్రమ బంధం.. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-07 13:21:09  IST  )

కాంగ్రెస్, బీజేపీ సిద్ధాంత వైరుధ్యాలు ఉన్న పార్టీలని.. అయినా రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు అక్రమ బంధాన్ని కొనసాగిస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ అన్నారు.

కాంగ్రెస్, బీజేపీలది అక్రమ బంధం.. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్, బీజేపీ సిద్ధాంత వైరుధ్యాలు ఉన్న పార్టీలని.. అయినా రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు అక్రమ బంధాన్ని కొనసాగిస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పనిగట్టుకుని బీఆర్ఎస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నాయన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం సలహాదారు వెదిరే శ్రీరామ్ తెలంగాణ బిడ్డ తెలంగాణ కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాసే విధంగా వెదిరే శ్రీరామ్ మాట్లాడుతున్నారని.. కేసీఆర్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆంధ్రా ఆదిత్యనాథ్‌దాస్ ఏపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని.. ఇరిగేషన్‌పై అవగాహన ఉన్న వెదిరే శ్రీరామ్ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.

తెలంగాణ బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఒక్క అంశంపైన అయినా కాంగ్రెస్‌ను బీజేపీ నేతలు నిలదీశారా అని అన్నారు. వెదిరే శ్రీరామ్‌కు కమాండ్ కంట్రోల్ రూమ్‌లో.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చాంబర్‌లో ఆయనకు ఏం పని అని ప్రశ్నించారు. రేవంత్, ఉత్తమ్, శ్రీరామ్ ముగ్గురు కలిసి కేసీఆర్‌పై కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎవరి ప్రయోజనం కోసం తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారనేది శ్రీరామ్‌కు తెలియదా అని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలోనే ఈ ఒప్పందం జరిగిందన్నారు. చంద్రబాబును మెప్పించడం కోసం బీజేపీ పనిచేస్తున్నదని.. అందుకే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రావడం లేదని అన్నారు. కిషన్‌రెడ్డికి, బండి సంజయ్‌కి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ నీటి హక్కుల కోసం మాట్లాడాలని డిమాండ్ చేశారు. మోడీ, రేవంత్‌రెడ్డి బడే భాయ్, చోటా భాయ్‌లా పనిచేస్తున్నారని.. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సిగ్గు పడాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు పల్లె రవికుమార్, గోసుల శ్రీనివాస్‌యాదవ్, కురువ విజయ్‌కుమార్, కట్ల స్వామి యాదవ్ పాల్గొన్నారు.

Next Story