- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్ బోర్డు విలీనం గందరగోళం.. విద్యాశాఖలో కీలక అధికారి తీరు వివాదం
విద్యాశాఖలో ఓ కీలక అధికారి తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సదరు అధికారి అలసత్వం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఫిర్యాదులు వస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యాశాఖలో ఓ కీలక అధికారి తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సదరు అధికారి అలసత్వం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యమైన అంశాల విషయంలో చాలా తేలికగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల పరువు పోయే పరిస్థితులు వస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. తాజాగా ఇంటర్ బోర్డు విలీనం విషయంలో ఆ ఆఫీసర్ నిర్లక్ష్యం వల్లే గందరగోళ పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. చివరికు సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని ఆ సమస్యను పరిష్కరించారని గుసగుసలు వినిపించాయి.
చివరివరకూ నాన్చుడు ధోరణి
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో విద్యాబోధన జరగాలంటూ సీఎం రేవంత్ బలంగా విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సందర్భం వచ్చిన ప్రతిసారీ ఎస్ఎస్‌సీ, ఇంటర్ బోర్డులను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తే ఎలా ఉంటుందో పరిశీలన చేయాలంటూ అధికారులను అలర్ట్ చేస్తున్నారు. ఆ సమయానికి సరేనంటూ తలూపిన విద్యాశాఖ అధికారులు ఆ విషయాన్ని పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది విద్యా కమిషన్ తన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించే సమయంలో సైతం 2 బోర్డులను విలీనం చేసే అంశం ఏమైదంటూ సీఎం గుర్తు చేసినట్లు తెలిసింది. అదే పనిలో ఉన్నామంటూ ఆ క్షణానికి చెప్పిన అధికారులు ఆ తర్వాత మాత్రం ఆ విషయాన్ని పక్కన పెట్టేశారని ఆరోపణలు ఉన్నాయి. సీఎం ఆదేశాల మేరకు అధికారులు బోర్డుల విలీనానికి కావాల్సిన ప్రక్రియ ప్రారంభించారేమోనని ఉద్దేశంతో 2026-27 అకడమిక్ ఇయర్ కోసం జారీ చేసిన అడ్మిషన్ షెడ్యూల్‌ను వాయిదా వేశారు. అసలు అలాంటి ప్రక్రియ ఏం జరగలేదని తెలుసుకుని ఈ ఏడాది యథావిధిగా ఇంటర్ అడ్మిషన్లను షెడ్యూల్‌ను ప్రారంభించారు.
ఫ్రీడమ్ ఇస్తే ఇరకాటంలోకి నెట్టిన అధికారి..
విద్యాశాఖలో కీలక హోదాలో పనిచేస్తోన్న ఓ ఆఫీసర్‌కు సీఎం రేవంత్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. సదరు అధికారి తీసుకున్న నిర్ణయాలు పక్కాగా ఉంటాయనే ధీమాతో తన సంతకం కోసం వచ్చే ప్రతి ఫైల్‌ను చూడకుండానే క్లియర్ చేస్తారని టాక్ ఉన్నది. సదరు అధికారి మాత్రం సీఎం ఇచ్చిన ఫ్రీడమ్‌ను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలున్నాయి. బోర్డుల విలీనం విషయంలో ఆ ఆఫీసర్ కాలయాపన చేయడం తప్పా, విలీనానికి ముందు తలెత్తే సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై సీఎంకు వివరించే ప్రయత్నం చేయలేదని ఫిర్యాదులు ఉన్నాయి. ‘బోర్డుల విలీనం విషయంలో ఆ ఆఫీసర్ కీలకం. కాని ఏనాడూ అందుకు కావాల్సిన కసరత్తు చేయలేదు. సీఎం చెప్పినప్పుడు సరేనంటూ సమాధానం ఇచ్చిన అధికారి ప్రస్తుతం అకడమిక్ ఇయర్ (2026–27)లో సాధ్యం కాదనే విషయం చివరి వరకు చెప్పకుండా నిర్లక్ష్యం వహించారు. దీనితో ప్రభుత్వం పరువుపోయే పరిస్థితి ఏర్పడింది’ అని ప్రభుత్వంలోని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వివరించారు.
వారం పాటు గందరగోళం
ముందుగా ప్రకటించిన ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు. దీంతో ఎస్ఎస్‌సీ, ఇంటర్ బోర్డులను విలీనం చేస్తారని ప్రచారం జరిగింది. ఇంత తొందరగా విలీనం ఎలా చేస్తారని ప్రశ్నలు వ్యక్తం అయ్యాయి. పూర్తిస్థాయి కసరత్తు చేసిన తరువాతనే షెడ్యూల్‌ను వాయిదా వేశారేమోనని అందరూ అనుకున్నారు. కానీ రోజులు గడుస్తున్నా సదరు అధికారి నుంచి ఎలాంటి రెస్పాండ్ లేకపోవడంతో సీఎం రేవంత్ నేరుగా జోక్యం చేసుకుని రివ్యూ నిర్వహించారు. ఇప్పటికప్పుడు విలీనం సాధ్యం కాదని సదరు ఆఫీసర్ నుంచి వచ్చిన సమాధానంపై సీఎం సీరియస్ గా ‘ఇంతకాలం ఏం చేశారు? ఇదే విషయాన్ని గతంలో ఎందుకు చెప్పలేదు? షెడ్యూల్ వాయిదా వేశాక ఇప్పుడు చెప్తారా?’ అని నిలదీసినట్లు తెలిసింది. అనంతరం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ అడ్మిషన్లు చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది.
అన్ని విషయాల్లో జోక్యం
సీఎం వద్ద జరిగే రివ్యూల్లో సదరు అధికారి తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. ప్రతి విషయంలో అతి జోక్యం చేసుకోవడం, ఇతర అధికారులు ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తుంటే అడ్డుతగలడం, సదరు ఆఫీసర్‌కు పరిపాటిగా మారిందని ఆరోపణలు ఉన్నాయి. విద్యాశాఖ పరిధిలోని ఇతర సంస్థలకు చెందిన సీనియర్ అధికారులను చులకనగా చూడటం సదరు ఆఫీసర్‌కు అలవాటుగా మారినట్లు విమర్శలు ఉన్నాయి. ఆమె వ్యవహారశైలి తీరుతో అటు ప్రభుత్వానికి, ఇటు ఎడుకేషన్ డిపార్ట్ మెంట్‌కు చెడ్డ పేరు వస్తుందని ప్రచారం జరుగుతున్నది.






