టికెట్ దక్కుతుందా? కంటెస్టెడ్ ఎమ్మెల్యేల్లో అయోమయం

by Disha Web Desk 4 |
టికెట్ దక్కుతుందా? కంటెస్టెడ్ ఎమ్మెల్యేల్లో అయోమయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ తరుపున 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలకు ఏ పదవి లేదు. కనీసం నామినేటెడ్ పదవిని కూడా అధిష్టానం అప్పగించలేదు. ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల పూర్తి బాధ్యతలను అప్పగించింది. దీంతో ఇతర పార్టీల నుంచి గులాబీ తీర్ధం పుచ్చుకున్న వారే సుప్రీం అయ్యారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలకు ఎలాంటి బాధ్యతలు లేకపోవడంతో ప్రొటోకాల్ లేదు. రాబోయే ఎన్నికల్లో తమకు మళ్లీ టికెట్ కేటాయిస్తారా? లేదా? అనేదానిపై సందిగ్ధం నెలకొనడంతో వారిలో అయోమయం నెలకొంది. తమ భవిష్యత్ ఏమిటని మదనపడుతున్నారు.

గత ఎన్నికల్లో సిట్టింగ్ లకే టీఆర్ఎస్ అధిష్టానం టికెట్లు కేటాయించింది. కానీ దాదాపు 25 నియోజకవర్గాల్లో ఓటమి పాలైంది అధికార పార్టీ. అయినప్పటికీ అధిష్టానం ధైర్యంగా ఉండాలని, మంచి పదవి ఇస్తామని భరోసా ఇచ్చింది. ఈ తరుణంలోనే కాంగ్రెస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలతో పాటు టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరారు. రాబోయే ఎన్నికల్లో సైతం సిట్టింగ్ లకే ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తామని గులాబీ బాస్ హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే అక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యేలకు మాత్రం అధిష్టానం ఎలాంటి నామినేటెడ్ పదవులు అప్పగించలేదు. దీనికి తోడు ఎమ్మెల్యేలకే పూర్తి బాధ్యతలు అప్పగించడం, సభ్యత్వ నమోదు, ఇతర అభివృద్ధి పనులు సైతం వారికే అప్పగించింది. దీంతో ఓడిపోయిన ఎమ్మెల్యేలకు పార్టీ సైతం మొండిచేయి చూపింది. వారికి సన్నిహితులుగా ఉన్న ఇద్దరు కీలక మంత్రులతో ప్రగతి భవన్ సమీపంలోని పేరుగాంచిన హోటళ్లలో భేటీ అయ్యి నియోజకవర్గ పరిస్థితులతో పాటు తమకు గుర్తింపును ఇవ్వాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. తాజాగా నాలుగురోజుల క్రితం ఓ మంత్రితో మాజీ ఎమ్మెల్యేలు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముందస్తు రావచ్చనే ఊహాగానాల నేపథ్యంలో కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు టికెట్ కోసం ఒత్తిడి చేసినట్లు సమాచారం.

కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన పటోళ్ల సబితా ఇంద్రా రెడ్డి (మహేశ్వరం),జాజుల సురేందర్ (ఎల్లారెడ్డి), రేగా కాంతారావు (పినపాక), కందాల ఉపేందర్ రెడ్డి (పాలేరు), హరిప్రియ(ఇల్లందు), వనమా వెంకటేశ్వర రావు( కొత్తగూడెం), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్), దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (ఎల్బీనగర్), ఆత్రం సక్కు(ఆసిఫాబాద్), బీరం హర్షవర్థన్ రెడ్డి (కొల్లాపూర్), గండ్ర వెంకట రమణా రెడ్డి(భూపాలపల్లి), రోహిత్ రెడ్డి (తాండూరు), టీడీపీ నుంచి సండ్ర వెంకట వీరయ్య(సత్తుపల్లి), మెచ్చా నాగేశ్వర్‌ రావు(అశ్వారావుపేట) టీఆర్ఎస్ లో చేరారు.

ఇదిలా ఉంటే మధిర, సంగారెడ్డి, మంథని, భద్రాచలం, మునుగోడు, ములుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపొందగా.. గోషామహల్, దుబ్బాక, హుజూరాబాద్ లో బీజేపీ విజయం సాధించింది. అయితే ఈ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ తరుపున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు పార్టీలో ఆశించిన గుర్తింపు లభించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో సైతం ప్రాధాన్యత ఉండాలంటే నామినేటెడ్ పోస్టులు తప్పనిసరి. అయితే ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇవ్వాలని మంత్రులను అభ్యర్థిస్తున్నారు. 2018 ఎన్నికల్లో ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థులు గతంలోనే మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. హామీలను సైతం తీసుకున్నారు. అయితే ఏళ్లు గడిచినా హామీ నెరవేరకపోవడంతో తిరిగి మళ్లీ మంత్రులతో భేటీ అవుతున్నారు. తమకు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. అంతేగాకుండా నామినేటెడ్ పదవి అప్పగిస్తే నియోజకవర్గాల్లో జరిగే అభివృద్ధి, సంక్షేమం, పార్టీ కార్యక్రమాల్లో తగిన గుర్తింపు ఉంటుందనే అభిప్రాయం సైతం వ్యక్తం చేసినట్లు సమాచారం. అదే విధంగా ఎన్నికల నాటికి ఆర్ధికంగా బలోపేతం అవుతామని పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే దీనికి మంత్రులు సైతం సూచనప్రాయంగా అంగీకారం తెలిపారని ఓ కంటెస్టెడ్ ఎమ్మెల్యే తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ సైతం ఇప్పిస్తామని మంత్రులు భరోసా ఇచ్చారని తెలిసింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed