ఆ నినాదాన్ని గట్టిగా వినిపించాలని ఫిక్సైన కాంగ్రెస్.. ఇరకాటంలో బీఆర్ఎస్

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టినప్పటి నుంచి అన్ని పార్టీలు మరోసారి బీసీ జపం మొదలుపెట్టాయి.

ఆ నినాదాన్ని గట్టిగా వినిపించాలని ఫిక్సైన కాంగ్రెస్.. ఇరకాటంలో బీఆర్ఎస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టినప్పటి నుంచి అన్ని పార్టీలు మరోసారి బీసీ జపం మొదలుపెట్టాయి. బీసీల రాజ్యాధికార నినాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఎక్కడ చూసినా బీసీ అంశంపైనే చర్చ నడుస్తున్నది. రాజకీయ పార్టీలు, నాయకులు ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. భవిష్యత్తులో బీసీ సీఎం అని పీసీసీ చీఫ్ ప్రకటించడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది.

కాంగ్రెస్ స్టేట్ చీఫ్ సవాల్

కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో బీసీలు ముఖ్యమంత్రులు కాలేదు. కానీ పీసీసీ చీఫ్ లుగా పని చేశారు. రాష్ట్రంలో బీసీల జనాభానే అధికమని సర్వేలో స్పష్టమైంది. జాతీయ స్థాయిలోనూ బీసీ నినాదాన్ని గట్టిగా వినిపించాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీసీ సీఎం కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మీ పార్టీల సంగతి ఏమీటో చెప్పాలంటూ విపక్ష పార్టీలకు సవాల్ చేయడం ఆసక్తికరంగా మారింది. పీసీసీ చీఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి వర్గంలో బీసీలకు సముచితస్థానం లభిస్తుందనే చర్చ సైతం నడుస్తున్నది. డిప్యూటీ సీఎంగానూ ఒకరికి అవకాశం లభిస్తుందని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో కంటే బీసీలకు ఎక్కువ సంఖ్యలోనే మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

బీజేపీ పగ్గాలు ఎవరికో?

రాష్ట్రంలో బీసీ జపం నడుస్తున్న క్రమంలో బీజేపీ పగ్గాలు ఎవరికి దక్కుతాయోన్న చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తున్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా గతంలో బీసీలైన లక్ష్మణ్, బండి సంజయ్ పని చేశారు. ప్రస్తుతం 20 నెలలుగా తాత్కాలిక అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పనిచేస్తున్నారు. ఇప్పుడు పూర్తిస్థాయి అధ్యక్షుడిగా బీసీకి అవకాశమిస్తారా? ఇంకెవరినైనా నియమిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ పేరు ఖరారైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బండి సంజయ్ కు ఇచ్చే అవకాశాలు సైతం ఇన్నాయనే చర్చ జరుగుతున్నది. ఇప్పటికే పార్టీలో అత్యంత కీలకమైన పార్లమెంటరీ బోర్డులో బీసీ నేత లక్ష్మణ్కు అవకాశం ఇచ్చారు. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ఉన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా బీసీకి అవకాశమిస్తే వెనకబడిన వర్గాలకు కాషాయపార్టీ పెద్ద పీట వేసినట్లుగానే భావించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాబోయే ఎన్నికలకు సైతం బీసీ సీఎం నినాదంతోనే వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సైతం ప్రచారం జరుగుతున్నది. అయితే పార్టీ విధేయులకు, ఆర్ఎస్ఎస్బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారికే పదవులు ఇవ్వాలని మరికొందరు సూచిస్తున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న రామచందర్ రావు, చింతల రామచంద్రారెడ్డి లాంటి వారికీ అవకాశమివ్వాలని చెబుతున్నారు.

ఇరకాటంలో బీఆర్ఎస్

బీసీ సీఎం, బీసీ అధ్యక్షుడు లాంటి ప్రకటనలతో కాంగ్రెస్, బీజేపీలు ఓ వైపు దూసుకెళ్తుండగా.. బీఆర్ఎస్ మాత్రం బీసీలకు కీలక అవకాశాలు కల్పించడంలో వెనకబడి ఉందనే చర్చ నడుస్తున్నది. పార్టీకి చెందిన కీలక పదవులన్నీ కేసీఆర్ కుటుంబంలోనే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ఎల్పీ నేత ఇలా ప్రధానమైన మూడు పోస్టులు కూడా ఆ కుటుంబంలో ఉన్నాయి. పార్లమెంటరీ పార్టీ నేతగా కేఆర్ సురేశ్ రెడ్డి ఉన్నారు. కొద్ది కాలం క్రితం శాసనమండలిపక్ష నేత పోస్టును బీసీకి అప్పగించారు. పార్టీలో వివిధ కమిటీలను వేసి కూడా దాదాపు ఏడు సంవత్సరాలు దాటింది. దీంతో పార్టీ కమిటీలు నామమాత్రంగా మారాయి. పార్టీలో కీలకమైన పదవులన్నీ అగ్రవర్ణాలకే ఉన్నాయని, నిర్ణయాధికారం కూడా అగ్రవర్ణాలదేనని బీసీ నాయకులు చెబుతున్నారు. పార్టీ అధ్యక్ష పదవి, శాసనసభాపక్ష నేత, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను బీసీలకు ఇవ్వగలుగుతారా? అంటూ కాంగ్రెస్, బీజేపీలు సవాల్ విసిరినా అగ్రనాయకత్వం నుంచి స్పందన రాలేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు లు కుల గణనలో కూడా పాల్గొనకపోవడం, మరోవైపు ఎమ్మెల్సీ కవిత వివరాలు అందించడం ఇలాంటి పరస్పర విరుద్ధ చర్యలు పార్టీ నాయకులను ఇరకాటంలోకి నెట్టేశాయి. పార్టీ నాయకత్వ బాధ్యతలే అప్పగించలేని వారు ఇక బీసీలను సీఎం చేస్తారా అని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

Next Story