ఆశావహుల ఆశలు ఆవిరి.. అంతా బూడిదలో పోసిన పన్నీరేనా?

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-10 02:01:58  IST  )

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన స్టే ఆశావహుల్లో ఆందోళన కలిగిస్తోంది.

ఆశావహుల ఆశలు ఆవిరి.. అంతా బూడిదలో పోసిన పన్నీరేనా?
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన స్టే ఆశావహుల్లో ఆందోళన కలిగిస్తోంది. ‘ఎప్పటికైనా నేను నా ఊరికి సర్పంచ్ కావాలని కొందరు.. నేను ఎంపీటీసీగా గెలిచి అన్ని అనుకూలిస్తే ఎంపీపీని కావాలని మరికొందరు.. ఇంకొందరు అయితే ఎప్పటికైనా మా జిల్లాకు జెడ్పీ చైర్మన్ కావాలని కలలు కంటే.. మరికొందరు కనీసం మా గ్రామానికి వార్డు మెంబరు అయినా చాలు అనుకున్నారు. ఎన్నికల సంఘం రిజర్వేషన్లు ప్రకటించడంతో కొంతమంది నిరాశకు గురికాగా, మరికొంతమంది రిజర్వేషన్లు తమకు అనుకూలంగా రావడంతో ఇక పదవులు తమకు దక్కినట్లేనని సంబుర పడ్డారు. గురువారం నుంచి నామినేషన్లు అనగానే.. ఆశావహులంతా ఊహల పల్లకిలో విహరించారు. ఇప్పటికే పెద్దఎత్తున ఖర్చులు చేశాం, అందరినీ కలిశాం.. హామీలు కూడా ఇచ్చాం.. ఇక విజయం నాదేనని నామినేషన్లు వేయడానికి సిద్ధమయ్యారు. ఈ తరుణంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ఇన్నాళ్లు ఖర్చు పెట్టాం.. అందరిని ఒప్పించుకున్నాం.. కానీ తర్వాత రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయో.. రావోనని ఆందోళన చెందుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలతో ఎప్పటికైనా నేను నా ఊరికి సర్పంచ్ కావాలని కొందరు.. నేను ఎంపీటీసీగా గెలిచి అన్ని అనుకూలిస్తే ఎంపీపీని కావాలని మరికొందరు.. ఇంకొందరు అయితే ఎప్పటికైనా మా జిల్లాకు జెడ్పీ చైర్మన్ కావాలని కలలు కంటే.. మరికొందరు కనీసం మా గ్రామానికి వార్డు మెంబరు అయినా చాలు అనుకున్నారు. ఎన్నికల సంఘం రిజర్వేషన్లు ప్రకటించడంతో కొంతమంది నిరాశకు గురికాగా, మరికొంతమంది రిజర్వేషన్లు తమకు అనుకూలంగా రావడంతో ఇక పదవులు తమకు దక్కినట్లేనని సంబుర పడ్డారు. గురువారం నుంచి నామినేషన్లు అనగానే.. ఆశావహులంతా ఊహల పల్లకిలో విహరించారు. ఇప్పటికే పెద్దఎత్తున ఖర్చులు చేశాం, అందరినీ కలిశాం.. హామీలు కూడా ఇచ్చాం.. ఇక విజయం నాదేనని నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ఇన్నాళ్లు ఖర్చు పెట్టాం.. అందరిని ఒప్పించుకున్నాం.. కానీ రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయో.. రావోనని, అనవసరంగా ఆస్తులు, డబ్బులు కోల్పోయాం అని ఆవేదన చెందుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో పలు మండలాల్లో..

- జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని ఓ గ్రామంలో ఒక యువ రైతు సర్పంచ్ బరిలో నిలిచేందుకు రెండేళ్ల ముందే రెండు ఎకరాల పొలం అమ్మాడు. ఈ రెండేళ్లలో రూ.45లక్షలకు పైగా ఖర్చు చేశాడు. రిజర్వేషన్ కూడా అనుకూలంగా వచ్చింది. నామినేషన్లు అయ్యాక ఉన్న ఇంకో ప్లాట్ అమ్మేందుకు నిర్ణయించుకున్నాడు. కానీ ఎన్నికల ప్రక్రియ ఆగిపోవడంతో అతడి బాధకు అంతులేకుండా పోయింది.

- ఉట్కూరు మండలంలోని రెండు గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకునేందుకు ఆశావహులు గ్రామ పెద్దల సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఏకగ్రీవం అయితే గ్రామ అభివృద్ధికి ఆర్థిక సాయం అందజేసే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అంతకుముందు పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పెద్దఎత్తున ఖర్చు పెట్టినట్లు సమాచారం.

- దామరగిద్ద మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువకుడు తన తల్లిదండ్రులు, భార్యా పిల్లలతో బతుకుతెరువు కోసం వలస వెళ్లాడు. ఇల్లు కట్టుకోవడానికి రూ.10లక్షల దాకా కూడబెట్టుకున్నాడు. తమ గ్రామ ఎంపీటీసీ రిజర్వు కావడంతో ఎలాగైనా పోటీ చేయాలని గ్రామానికి వచ్చాడు. రూ.3 లక్షలు ఖర్చు చేశాడు. కోర్టు తీర్పు విని నిరాశగా బతుకుదెరువు కోసం తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయాడు.

- నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని ఒక గ్రామానికి చెందిన నాయకుడు ఎన్నికల కోసం ఇప్పటికే రూ.40లక్షలు ఖర్చు చేసినట్లు ఆ గ్రామస్తులు చెబుతున్నారు. న్యాయస్థానం తీర్పుతో అతడు తీవ్ర నిరుత్సాహానికి గురైనట్లు తెలుస్తోంది.

- బాలానగర్, రాజాపూర్ మండలాలలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా పోటీ చేయాలనుకున్న వారు భూములను ఇతరుల పేరుతో మార్టిగేజ్ చేసి వడ్డీకి డబ్బు తెచ్చుకున్నారు. కొంతమంది దసరా పండుగ, బోనాలు తదితర పండుగల సందర్భాల్లో పెద్దఎత్తున మద్యం, మాంసాలను పంపిణీ చేశారు. అనుచరులను తయారు చేసుకొని ప్రతిరోజు రూ.వేలల్లో ఖర్చు చేశారు.

- అచ్చంపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఈసారి మేమే సర్పంచులం, ఎంపీటీసీలం, జెడ్పీటీసీలుగా ఎంపిక అవుతామని ఆశించారు. అందుకు అనుగుణంగా అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకొని గత రెండు మూడేళ్లుగా రూ.లక్షలు ఖర్చు చేశారు. రిజర్వేషన్లు వారి ఆశలకు వ్యతిరేకంగా రాగా, కొంతమందికి అనుకూలంగా వచ్చాయి. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చినవారు ఇక మేము ప్రజాప్రతినిధులం అయినట్లే అనుకున్నారు. కానీ కోర్టు తీర్పుతో వారి ఆశలు నీరు గారాయి.

- వెల్దండ మండలంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు కొంతమంది ఎలాగైనా ఎన్నికలలో గెలవాలి అన్న ఉద్దేశంతో శుభ, అశుభ కార్యక్రమాలలో ఆర్థిక సాయం అందించారు. పండుగ సందర్భంగా పెద్దఎత్తున మద్యం, మాంసాహారాలు కొంతమంది పంపిణీ చేస్తే మరికొందరు గ్రామాల్లో సొంత డబ్బును వెచ్చించి వీధిలైట్లను ఏర్పాటు చేశారు.

ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి మండలంలోనూ ఆశావహులు పెద్దఎత్తున పదవులపై ఆశలు పెట్టుకుని ఆయా పార్టీల ముఖ్య నాయకులకు కాక పడుతూ.. ఖర్చు చేసుకున్నారు. కొంతమంది తమకు ఉన్న డబ్బును ఖర్చు చేయగా, మరికొందరు ఆస్తులను అమ్మేసి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకొని ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కోర్టు తీర్పుతో వారి ఆశలు అడియాశలు అయ్యాయి. ఎన్నికలు జరిగే సమయానికి రిజర్వేషన్లు ఇప్పటిలాగే ఉంటాయా..? మారుతాయా..? అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకున్నాం కదా అని ఆశావహులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story