బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోశ్ రావుపై ఈడీకి ఫిర్యాదు.. మరో సంచలనం తప్పదా?

by Prasad Jukanti |

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఆర్థిక మూలలపై మరోసారి భారీ కదలిక రాబోతోందా?

బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోశ్ రావుపై ఈడీకి ఫిర్యాదు..  మరో సంచలనం తప్పదా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్ రావు (Joginapally Santosh Rao) భూ అక్రమాలపై విచారణ జరపాలని కేసీఆర్ అన్న కూతురు, కాంగ్రెస్ నేత రమ్యరావు ఈడీకి (Enforcement Directorate) ఫిర్యాదు చేశారు. ఇవాళ హైదరాబాద్‍లో ఈడీ అధికారులను స్వయంగా కలిసిన రమ్యారావు (Ramya Rao).. సంతోశ్‍రావుతో పాటు ఆయన టీమ్ సభ్యులపై ఫిర్యాదు చేశారు. ఓ డాక్యూమెంట్ ఫైల్స్ తో ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన ఆమె సంతోశ్ రావు భూకుంభకోణాలకు సంబంధించిన కీలక ఆధారాలను ఈడీకి సమర్పించినట్లు అధికారులతో భేటీ అనంతరం మీడియాతో చెప్పారు. సంతోశ్ రావు ఆయన టీమ్ సభ్యులు మహిళలతో పాటు అనేక మందిని బెదిరించి భూ అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆస్తులపై లోతైన దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా తాము ఇంకా అధికారంలో ఉన్నట్లుగానే భావిస్తూ తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు.

అధికారులను మేనేజ్ చేస్తూ బెదిరింపులు:

పోలీసులు, తశీల్దార్ స్థాయి అధికారులను మేనేజ్ చేసుకుంటూ నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఆస్తులు ట్రాన్స్ ఫర్ చేసుకున్నారని ఆరోపించారు. అక్రమంగా భూదందాలు చేస్తూ వాటిలో వచ్చిన డబ్బును లిక్కర్ స్కామ్‍లో పెట్టారని ఆరోపించారు. మరో రెండు మూడు రోజుల్లో మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వీళ్ల అవినీతి బాగోతం మొత్తం వివరిస్తానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంతగానో గౌరవించి అభిమానించే సుమిత్ర ఆంటీ కోడలు సుచరిత రెడ్డిని సైతం సంతోశ్ రావు అండ్ టీమ్ అన్యాయం చేశారని ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని కోరారు. ఇప్పటికే సీబీఐ, ఏసీబీకి ఫిర్యాదు చేశామని ఇప్పుడు ఈడీకి ఫిర్యాదు చేశామన్నారు.

లిక్కర్ స్కామ్ లో సంచలనం తప్పదా?

కాగా తెలంగాణ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఓ కుదుపు కుదిపేసింది. ఈ లిక్కర్ స్కామ్ కు (Liquor Scam) నిధులు సంతోశ్ రావు ఆయన టీమ్ భూదందాల నుంచి వచ్చిన డబ్బులే ఆధారం అని తాజాగా రమ్యరావు వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారింది. రమ్యరావు ఫిర్యాదు మేరకు సీబీఐ, ఈడీ మరోసారి రంగంలోకి దిగితే లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి అలజడి రేగనుందా అనే చర్చ తెరమీదకు వస్తోంది.

Next Story