ముస్సోరీలో హైడ్రాపై కమిషనర్ ఏవీ రంగ‌నాథ్ ప‌వ‌ర్‌ పాయింట్ ప్ర‌జెంటేష‌న్.. ఏం చెప్పారంటే!

by Ramesh Naini |

ప‌ట్ట‌ణీక‌ర‌ణ వేగంగా జ‌రుగుతున్న వేళ‌.. ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు, పాల‌న అందించ‌డానికి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో చ‌ర్చించ‌డానికి మంగ‌ళ‌వారం ఉత్త‌రాఖండ్, ముస్సోరీలోని లాల్‌బ‌హ‌ద్దూర్ శాస్త్రి నేష‌న‌ల్ అకాడ‌మీలో ‘మున్సిప‌ల్ గ‌వ‌ర్నెన్స్ ఫ‌ర్ అడ్మినిస్ట్రేట‌ర్స్‌’ పేరిట 5 రోజుల మేధోమ‌థ‌నానికి హైడ్రా క‌మిష‌న‌ర్ ప్ర‌త్యేక ఆహ్వానితులుగా హాజ‌ర‌య్యారు.

ముస్సోరీలో హైడ్రాపై కమిషనర్ ఏవీ రంగ‌నాథ్ ప‌వ‌ర్‌ పాయింట్ ప్ర‌జెంటేష‌న్.. ఏం చెప్పారంటే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘ప్ర‌పంచ జ‌నాభా 823 కోట్లుంటే.. అందులో మ‌న దేశ జ‌నాభా 145 కోట్లు. ముంబ‌య్‌, ఢిల్లీ, బెంగ‌ళూరు, హైద‌రాబాద్ ప‌ట్ట‌ణాల‌లో ప‌ట్ట‌ణ జ‌నాభా పెరుగుద‌ల గ‌ణ‌నీయంగా ఉంది. దేశంలో 2050 నాటికి న‌గ‌ర జ‌నాభా 50 కోట్ల‌కు చేర‌నుంద‌ని లెక్క‌లు చెబుతున్నాయి. 1975లో హైద‌రాబాద్ జ‌నాభా 21 ల‌క్ష‌లుండంగా.. ప్ర‌స్తుతం 1.3 కోట్ల‌కు చేరింది. హైద‌రాబాద్‌లో జ‌నాభా వృద్ధి రేటు 6.2 రెట్లుంది. న‌గ‌ర జ‌నాభా పెరుగుద‌ల‌ను దృష్టిలో పెట్టుకుని అంద‌రికీ మెరుగైన‌, ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన జీవ‌నాన్ని అందించాల‌నే ల‌క్ష్యంతో తెలంగాణ ప్ర‌భుత్వం హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ-HYDRAA)ను తీసుకువ‌చ్చింది’ అని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ చెప్పారు. దేశంలోనే ఇలాంటి వ్య‌వ‌స్థ ప్ర‌ప్ర‌థ‌మ‌మ‌ని పేర్కొన్నారు. ప‌ట్ట‌ణీక‌ర‌ణ వేగంగా జ‌రుగుతున్న వేళ‌.. ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు, పాల‌న అందించ‌డానికి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో చ‌ర్చించ‌డానికి మంగ‌ళ‌వారం ఉత్త‌రాఖండ్, ముస్సోరీలోని లాల్‌బ‌హ‌ద్దూర్ శాస్త్రి నేష‌న‌ల్ అకాడ‌మీలో ‘మున్సిప‌ల్ గ‌వ‌ర్నెన్స్ ఫ‌ర్ అడ్మినిస్ట్రేట‌ర్స్‌’ పేరిట 5 రోజుల మేధోమ‌థ‌నానికి హైడ్రా క‌మిష‌న‌ర్ ప్ర‌త్యేక ఆహ్వానితులుగా హాజ‌ర‌య్యారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ర్వీసుల్లో ఉన్న సీనియ‌ర్ ఐఏఎస్‌లు, ముఖ్య ప‌ట్ట‌ణాల మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎన్‌డీఎంఏ, ఎస్‌డీఆర్ఎఫ్ అధికారులు హాజ‌రైన ఈ స‌ద‌స్సులో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప్ర‌సంగించారు. హైడ్రా ఆవిష్క‌ర‌ణ‌, విధివిధానాలు, ల‌క్ష్యాలు వివ‌రించారు.

తెలంగాణ ప్ర‌భుత్వ సాహ‌సోపేత నిర్ణ‌యం హైడ్రా..

హైడ్రా లాంటి వ్య‌వ‌స్థ‌ను తీసుకురావ‌డం.. అధికారాలు క‌ట్ట‌పెట్ట‌డం తెలంగాణ ప్ర‌భుత్వ సాహ‌సోపేత నిర్ణ‌యంగా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ అభివ‌ర్ణించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచ‌న‌ల‌ నుంచి ఆవిష్కృత‌మైన ఈ సంస్థ‌.. ప్ర‌కృతి వైప‌రీత్యాల నిర్వ‌హ‌ణ‌లో కొత్త‌ కోణాన్ని ఆవిష్క‌రించింద‌న్నారు. కాలుష్యం కార‌ణంగా క్లౌడ్‌బ‌ర‌స్ట్‌లు స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయిన వేళ‌.. వ‌ర‌ద‌లకు ఆస్కారం ఉండే అంశాల‌పై హైడ్రా దృష్టి పెట్టింది. న‌గ‌రాల్లో ఉండే చెరువులు, నాలాల‌ను పున‌రుద్ధ‌రించి.. ప్ర‌కృతి చికిత్స హైడ్రా చేస్తోంద‌న్నారు. చెరువుల‌తో పాటు వాటిని అనుసంధానం చేసే నాలాల‌ను ప‌రిర‌క్షించ‌డంతో పాటు పున‌రుద్ధ‌రిస్తున్నామని అన్నారు. ఈ రెండు చ‌ర్య‌ల‌తో హైద‌రాబాద్ న‌గ‌రంలో చాలా వ‌ర‌కు వ‌ర‌ద ముప్పును త‌గ్గించామ‌న్నారు. హైడ్రాను తీసుకువ‌చ్చిన ప్ర‌భుత్వంపైన‌, హైడ్రా పైనా అనేక విమ‌ర్శ‌లు చేసిన రాజ‌కీయ పార్టీలు త‌ర్వాత కొనియాడ‌టం మొద‌లు పెట్టాయి. క‌బ్జాదారులు, ఆక్ర‌మ‌ణ‌దారులు హైడ్రాపై బుర‌ద‌జ‌ల్లే కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టినా.. ప్ర‌జ‌లు వాటిని తిప్పి కొట్టారు. హైడ్రాకు మ‌ద్ద‌తుగా భారీ ర్యాలీలు నిర్వ‌హించి ప్ర‌భుత్వ ముందు చూపున‌కు జై కొట్టారు.

హైడ్రా కార్య‌క‌లాపాల‌పై ఆస‌క్తి...

ప‌వ‌ర్‌ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా హైడ్రా కార్య‌క‌లాపాల‌ను క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ వివ‌రించిన‌ప్పుడు వివిధ స్థాయిల సీనియ‌ర్ అధికారులు ఎంతో ఆస‌క్తిగా తిల‌కించారు. కొన్ని సార్లు సందేహాల‌ను నివృత్తి చేసుకున్నారు. హైడ్రా చ‌ర్య‌ల‌వ‌ల్ల ప్ర‌భుత్వం ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొందా అని అడిగి తెలుసుకున్నారు. ప్ర‌జ‌ల స్పంద‌న ఎలా ఉంది?, బ‌డాబాబుల భూ క‌బ్జాల‌ను తొల‌గించిన‌ప్పుడు ఉండే ఒత్తిళ్ల‌పై ఆరాతీశారు. ఇలా అనేక సందేహాల‌ను నివృత్తి చేసుకున్నారు. హైడ్రా సుమారు 1,313.19 ఎకరాల ఆక్రమిత భూములను (చెరువులు, పార్కులు, రోడ్లు, నాలాలు) స్వాధీనం చేసుకుందని తెలిపారు. వీటి విలువ సుమారు రూ. 65,650 కోట్లు ఉంటుందని అంచనా.. మూసీ నది పరీవాహక ప్రాంతంలోని ఆక్రమణలను తొలగించి, నది సహజ ప్రవాహాన్ని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని ఆయన తెలిపారు. దేశ‌వ్యాప్తంగా హైడ్రా లాంటి వ్య‌వ‌స్థ ఉండ‌డం చాలా అవ‌స‌ర‌మ‌ని ఈ స‌ద‌స్సుకు హాజ‌రైన కేంద్ర‌, రాష్ట్ర ఉన్న‌తాధికారులు భావించారు. దేశ‌వ్యాప్తంగా ఇలాంటి వ్య‌వ‌స్థ అన్ని ప‌ట్ట‌ణాల‌కు అవ‌స‌రముంద‌ని ప‌లువురు వ్యాఖ్యానించారు.

Next Story