తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ముందడుగు.. ‘షీల్డ్ 2.0’ సదస్సు ప్రారంభం

by Prasad Jukanti |

హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ‘షీల్డ్ 2.0’ సదస్సు ప్రారంభమైంది.

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ముందడుగు.. ‘షీల్డ్ 2.0’ సదస్సు ప్రారంభం
X

దిశ,తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: సైబర్ నేరాల నియంత్రణ, కట్టడే లక్ష్యంగా ఇవాళ హైదరాబాద్‍లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‍లో (Command Control Center) సైబర్ సెక్యూరిటీ బ్యూరో 'షీల్డ్ 2.0' (SHIELD 2.0) సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా సీఎస్ కె.రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి హాజరయ్యారు. బాధితులకు రక్షణ-డిజిటల్ భవిష్యత్తుకు భద్రత అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో సైబర్ సారథి పోస్టర్‍ను సీఎస్, డీజీపీ విడుదల చేశారు. సైబర్ రంగంలో వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 2025 షీల్డ్ విశేషాలు, 2026 లక్ష్యాలకు సంబంధించి ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. ఈ సదస్సులో భాగంగా ఏఐ ఆధారిత పోలీస్ వ్యవస్థపై తమిళనాడు, పంజాబ్ ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక చర్చ నిర్వహించబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, పరిశ్రమల అధినేతలు, విద్యావేత్తలు, దేశవ్యాప్తంగా ఉన్న సైబర్ భద్రతా నిపుణులు పాల్గొన్నారు.

421 మంది అరెస్టు:

‘షీల్డ్ 2025’ కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (CPU) ప్రారంభమైందని పోలీసు శాఖ తెలిపింది. ఆన్‌లైన్ చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ (CSAM – పిల్లలపై లైంగిక దుర్వినియోగ సామగ్రి)ను ఎదుర్కోవడంలో CPU ఏర్పాటు తర్వాత గణనీయమైన ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు. గతంలో సుమారు 50,400 టిప్‌లైన్‌ల ద్వారా 37 కేసులు నమోదు చేసి 36 అరెస్టులు జరగగా, CPU ఏర్పాటు తర్వాత 1,20,563కు పైగా టిప్‌లైన్‌లను ప్రాసెస్ చేసి 866 కేసులు నమోదు చేసి 421 మందిని అరెస్టు చేశారు. ఇది మరింత సమన్వయంతో కూడిన మరియు టెక్నాలజీ ఆధారిత ప్రతిస్పందనను ప్రతిబింబిస్తుందని తెలిపారు.

సైబర్ భద్రతను అంతర్భాగంగా చేయాలి:

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు (IAS) మాట్లాడుతూ.. పాలన, ప్రజా సేవలు, కీలక మౌలిక సదుపాయాలపై ప్రభావం చూపే సైబర్ ప్రమాదాలను ఎదుర్కోవడానికి బలమైన విధానపరమైన సమన్వయం అవసరమని పేర్కొన్నారు. పరిపాలనా సంసిద్ధత, శాఖల మధ్య సమన్వయంతో సమర్థవంతమైన, సకాలంలో చర్యలు తీసుకోగలమని చెప్పారు. అన్ని స్థాయిల పరిపాలనలో సైబర్ భద్రతను అంతర్భాగంగా చేయాలని సూచించారు. డీజీపీ బి.శివధర్ రెడ్డి సైబర్ నేరాలను ఎదుర్కోవడంలో లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వేగంగా మారుతున్న నేర పద్ధతులు మరియు పెరుగుతున్న కేసుల సంఖ్యపై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా సైబర్ క్రైమ్ దర్యాప్తు, స్పందన, అమలు సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఆధునిక దర్యాప్తు సాంకేతికతలు, ప్రత్యేక శిక్షణ మరియు సమన్వయ విధానాల అవసరాన్ని ఆయన వివరించారు.

Next Story