విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు: డిప్యూటేషన్లతో కుదేలైన కళాశాలలు

by Naga Rani Yarlagadda |

సాంకేతిక విద్యాశాఖలో ఇష్టారాజ్యంగా డిప్యూటేషన్లు ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు: డిప్యూటేషన్లతో కుదేలైన కళాశాలలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సాంకేతిక విద్యాశాఖలో ఇష్టారాజ్యంగా డిప్యూటేషన్లు ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ డిపార్ట్ మెంట్ లో కీలక నిర్ణయాలు రిటైర్డ్ అధికారులు తీసుకుంటుండడంపై విద్యార్థి సంఘాలు, విద్యా నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటేషన్ల వ్యవహారం ఒకరిద్దరు చేతుల్లో ఉండడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, కమిషనర్ కూడా సరిగా పర్యవేక్షించకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయని పేర్కొంటున్నారు.

జేడీకి నామమాత్రపు అధికారాలు

డిపార్ట్ మెంట్ లో కమిషనర్ తర్వాత జాయింట్ డైరెక్టర్ స్థానముంటుంది. అయితే జేడీని పక్కన పెట్టి.. రిటైర్డ్ అధికారి, మరొక ఉన్నతాధికారి కుమ్మక్కయి మొత్తం డిపార్ట్ మెంట్ పై పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా డిప్యూటేషన్లు ఇస్తున్నారని, దీనికి సంబంధించి చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కోస్గీ ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ నడుస్తున్నాయి. కానీ అక్కడ పని చేస్తున్న ఫిజిక్స్, కెమిస్ట్రీ అధ్యాపకులను డిప్యూటేషన్ పై హైదరాబాద్ కు పంపించారు. దీంతో కోస్గీలో ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ విద్యకు కావాల్సిన బేసిక్ కోర్సులకు అధ్యాపకులు లేకుండా పోయారు. ఇది స్వయానా సీఎం నియోజకవర్గం కావడం విశేషం. కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను గతేడాది ఇంజినీరింగ్ కాలేజ్ గా అప్ గ్రేడ్ చేశారు. సాంకేతిక విద్యా శాఖ పరిధిలో నడిచే రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ ఇదే. గతేడాది అక్కడ 198 సీట్లకు గానూ 131 భర్తీ అయ్యాయి. ఈ సారి ఎప్ సెట్ రెండో విడత ముగిసే నాటికి కేవలం 41 మాత్రమే నిండాయి. అక్కడున్న మూడు బ్రాంచీలు సీఎస్ఈ అనుబంధ కోర్సులే అయినా.. విద్యార్థులు ఆసక్తి చూపకపోవడం గమనార్హం. రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీల్లో కేవలం 20 శాతమే నిండడం, పాలిటెక్నిక్ డిప్లొమా సీట్ల భర్తీ లోనూ అదే పరిస్థితి ఉండడం సాంకేతిక విద్యా శాఖను కలవరపరుస్తున్నది.

అడ్డగోలు డిప్యుటేషన్లతో తగ్గిన అడ్మిషన్లు

వనపర్తి పాలిటెక్నిక్ కాలేజీ పెద్ద బ్రాంచ్ లో ఇద్దరు కెమిస్ట్రీ లెక్చరర్లకు ఒక్కరే ఉన్నారు. ఆ ఒక్క లెక్చరర్ ను కూడా హైదరాబాద్ కు పంపించారు. అవసరం లేకున్నా హైదరాబాద్ లోని రామంతపూర్ కాలేజ్ లో ఇద్దరు ఈసీఈ ఫ్యాకల్టీలను తీసుకొచ్చారు. ఇలా డిప్యూటేషన్లు, ట్రాన్స్ ఫర్ల పేరుతో మారుమూల ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు ఫ్యాకల్టీలను పంపించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు పాలిటెక్నిక్ లో చదవాలని ఉన్నా.. సరైన వసతులు లేక ప్రత్యామ్నాయం చూసుకుంటున్నట్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి తెలుస్తున్నది. ఇటీవల ఇంటర్ అడ్మిషన్లు 20 వేలు పెరగడం, పాలిసెట్ అడ్మిషన్లు 78 శాతం నుంచి 55 శాతానికి పడిపోవడం ఇందుకు నిదర్శమని నిపుణులు పేర్కొంటున్నారు.

లైంగిక ఆరోపణలు ఉన్న వ్యక్తిని..

సిద్దిపేట్ లోని బాలికల పాలిటెక్నిక్ కాలేజీలో గతంలో ప్రిన్సిపాల్ గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తిపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడిని అప్పటి విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం విధుల నుంచి తొలగించారు. అయితే పటాన్ చెరులో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ గా లైంగిక ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయిన వ్యక్తిని సాంకేతిక విద్యా కమిషనర్ విధుల్లోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇతనికి ఇక్కడ పోస్టింగ్ ఇవ్వొద్దంటూ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డుకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి లేఖ రాశారు.

నిరంకుశ ధోరణి!

సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నిరంకుశంగా వ్యవహరిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. కమిషనర్ ను కలవడానికి చాంబర్ ఎదుట గంటలతరబడి వేచి చూడాల్సి ఉంటుందని ప్రజలతోపాటు అధికారులు సైతం వాపోతున్నారు. దీంతో చాలా పనులు పెండింగ్ లో ఉండిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఆరు పాలిటెక్నిక్స్ ను ఇంజినీరింగ్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేయాల్సి ఉండగా.. చివరి నిమిషయంలో జేఎన్టీయూ అఫిలియేషన్ల దగ్గర ప్రక్రియ నిలిచిపోయేలా కమిషనర్ చక్రం తిప్పారని, టెక్నికల్ బోర్డు నిధులను సైతం సొంత ఖర్చులకు వాడుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Next Story