పైసలు కొట్టు.. కొత్త రేషన్ కార్డు పట్టు! వసూల్ రాజాలుగా ఏఎస్‌ఓలు

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో అర్హులైన పేదలకు రేషన్​కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం చాలెంజ్‌గా తీసుకుని ముందువెళ్తుతుండగా కొందరు అధికారులు కార్డుల ఎంపికలో చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పైసలు కొట్టు.. కొత్త రేషన్ కార్డు పట్టు! వసూల్ రాజాలుగా ఏఎస్‌ఓలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అర్హులైన పేదలకు రేషన్​కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం చాలెంజ్‌గా తీసుకుని ముందువెళ్తుతుండగా కొందరు అధికారులు కార్డుల ఎంపికలో చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రూ. 2500 తమ చేతిలో పెడితే వారం రోజుల్లో కార్డు మంజూరు అవుతుందని, సెప్టెంబర్‌లో సన్నబియ్యం తీసుకుంటారని హామీలిస్తున్నట్లు తెలిసింది. ఇప్పడు కార్డు రాకుంటే ఐదేళ్ల వరకు రాదని దీంతో ఆరోగ్య శ్రీ సేవలతో పాటు సన్నబియ్యం తీసుకునే భాగ్యం కోల్పోతారని కబుర్లు చెప్పి జేబులు నింపుకునే దందాలో రాటు దేలుతున్నారు. ప్రభుత్వం ఈనెల 14న కొత్త కార్డులను లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసిన వారి పత్రాలు ఇంటింటికీ తిరిగి పరిశీలన చేసి.. 13వ తేదీలోగా సెలెక్ట్​ చేయాలని ఆదేశించడంతో అధికారులు ఇదే అదునుభావించి పేదల నుంచి డబ్బులు దండుకునే దందాకు తెగబడ్డారు.

నేరుగా దరఖాస్తుదారులకు ఫోన్..

స్థానిక పౌరసరఫరాల అధికారులు నిబంధనలు పాటించకుండా దరఖాస్తుదారులకు ఫోన్​చేసి మీ కుటుంబ, ఆదాయ వివరాలు ఇవ్వాలని పేర్కొంటూ పలానా చోటికి రావాలని సమాచారం ఇస్తున్నారు. దీంతో వారు ఆగమేఘాల మీద వారి వద్దకు వస్తే అడ్డమైన ప్రశ్నలు అడుగుతూ కార్డుల ఎంపిక అంతా సులభం కాదని కొర్రీలు పెడుతూ అయోమయానికి గురి చేస్తున్నారు. దీంతో ఇదేం బాధలు అంటూ పేదలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు లోకల్​లీడర్ల సాయంతో లంచాలకు పాల్పడుతూ తాము చెప్పినంత నగదు ఇస్తే ఎలాంటి నిబంధనలు పనిచేయవని.. ఎన్ని ఆస్తులు, అంతస్తులు, కార్లు ఉన్న కార్డు మంజూరు అవుతుందని హామీలిస్తున్నారు. దీంతో ఏమీ చేయలేక ప్రజలు వారి చెప్పిన నగదు ముట్టజెప్పి కార్డులు పొందే దుస్థితి నెలకొంది.

5 లక్షలకు చేరువలో..

ఈనెల 14 నాటికి 5 లక్షలకు కొత్తకార్డులు చేరుకోనున్నాయి. బీఆర్‌ఎస్​ప్రభుత్వంలో రేషన్​కార్డుల పంపిణీ జాడ లేదు. రేవంత్​సర్కార్​కొలువు దీరిన తరువాత అర్హులైన పేదలకు రేషన్​కార్డులు పంపిణీ చేస్తామని చెప్పి ప్రజాపాలన, గ్రామసభలు, ప్రజావాణి, మీసేవ ద్వారా కుటుంబ సభ్యులు పేర్ల యాడింగ్, డిలీటింగ్‌తో పాటు కొత్త కార్డులతో కలిపి మొత్తం 23 లక్షలు దరఖాస్తులు వచ్చాయి. అందులో మే 20వ తేదీలోగా 2.50 లక్షల మంది కొత్తకార్డుల మంజూరుతో పాటు 15 లక్షల మంది కుటుంబ సభ్యుల పేర్లను కార్డులో చేర్చారు. ఇప్పటివరకు 4.90 లక్షల కొత్తకార్డులు మంజూరు చేసినట్లు తెలిసింది. సీఎం రేవంత్​అర్హులైన వారికి కొత్త కార్డులు అందజేసే నాటికి ఆ సంఖ్య 5.50 లక్షలకు చేరుకోవచ్చని పౌరసరఫరాల అధికారులు వెల్లడించారు.

ఏఎస్‌ఓలపై త్వరలో చర్యలు..

చేతివాటం ప్రదర్శిస్తున్న ఏఎస్‌ఓలపై 14వ తేదీన కార్డుల పంపిణీ తరువాత చర్యలుంటాయని తెలుస్తోంది. పౌరసరఫరాల ఉన్నతాధికారులకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఏఎస్‌ఓల వ్యవహారాలపై ఫిర్యాదులు అందాయి. కొందరికి ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోసారి ఫిర్యాదు వస్తే సస్పెండ్‌కు వెనకడమని కూడా చెప్పినట్లు తెలిసింది. ఇప్పడు చర్యలు తీసుకుంటే సిబ్బంది కొరత కారణంగా కార్డుల ఎంపిక ఆలస్యమైతుందని, ప్రభుత్వం ఆదేశించిన గడువులోగా కార్డులు మంజూరు చేయలేమనే సమస్యతో కఠిన చర్యలు తీసుకునేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Next Story