పల్సర్ బైక్‌లో పడగ విప్పిన నాగుపాము! మెదక్ జిల్లాలో ఘటన వైరల్

by Ramesh Naini |

రోజూలాగే బైక్ దగ్గరికి వెళ్లిన ఓ యువకుడికి ఊహించని షాక్ ఎదురైంది. బైక్‌లో దూరిన ఓ నాగుపాము ఒక్కసారిగా బుసలు కొడుతూ పడగ విప్పింది.

పల్సర్ బైక్‌లో పడగ విప్పిన నాగుపాము! మెదక్ జిల్లాలో ఘటన వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రోజూలాగే బైక్ దగ్గరికి వెళ్లిన ఓ యువకుడికి ఊహించని షాక్ ఎదురైంది. బైక్‌లో దూరిన ఓ నాగుపాము ఒక్కసారిగా బుసలు కొడుతూ పడగ విప్పింది. ఈ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కౌడిపల్లి మండలం కుకుట్లపల్లి గ్రామానికి చెందిన జంగ ప్రశాంత్‌ అనే యువకుడు, ఎప్పటిలాగే రాత్రి తన ద్విచక్ర వాహనాన్ని (పల్సర్ బైక్) ఇంటి ఆవరణలో పార్క్‌ చేశాడు. శుక్రవారం తెల్లవారుజామున బయటకు వెళ్లేందుకు బైక్ వద్దకు చేరుకున్నాడు. వాహనం దగ్గరికి వెళ్లగానే బైక్‌లో నక్కిన నాగుపాము పడగ విప్పి బుసలు కొట్టడం ప్రారంభించింది. ఊహించని ఈ పరిణామానికి ప్రశాంత్‌ తీవ్ర భయాందోళనకు గురై ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు.

వెంటనే యువకుడు ఓ కర్ర సాయంతో పామును అక్కడి నుంచి తరిమేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు సైతం అక్కడికి చేరుకుని గుమిగూడటంతో.. ఆ నాగుపాము బండిలో నుంచి బయటకు వచ్చి దానంతట అదే స్థానిక పంట పొలాల్లోకి వెళ్లి పోయింది. పాము ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా వెళ్లిపోవడంతో ప్రశాంత్‌తో పాటు అక్కడున్న గ్రామస్తులంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story