- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెట్రోను లాభాల బాట పట్టించేలా సీఎం చారిత్రాత్మక నిర్ణయం: ప్రభుత్వ విప్ వేముల విరేశం
హైదరాబాద్ మెట్రో టేకోవర్‌పై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకం.. నిధులు అడ్డుకుంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఫైర్!

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టును ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (MLA Vemula Veeresham) కొనియాడారు. మొదటి దశను పూర్తి చేసిన ఎల్‌అండ్‌టీ సంస్థ భారీ అప్పులతో నష్టాల్లో ఉండటం వల్ల రెండో దశకు ముందుకు రాలేని పరిస్థితుల్లో సీఎం దూరదృష్టితో వ్యవహరించారని విరేశం తెలిపారు. సుమారు రూ.30 వేల కోట్ల విలువైన ఈ మెట్రో ప్రాజెక్టును కేవలం రూ.15 వేల కోట్లకు తెలంగాణ ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. దీనికోసం ప్రభుత్వం ఆర్బీఐ గ్యారెంటీతో రూ.13,539 కోట్లను కేవలం 4 శాతం వడ్డీకే సమీకరించిందని, టేకోవర్ చేసిన మొదటి రోజు నుంచే మెట్రో లాభాల్లోకి వచ్చేలా పక్కా ప్రణాళికలు రూపొందించిందని వెల్లడించారు.
దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరంగా మారుస్తుంటే.. తెలంగాణలో మాత్రం ప్రైవేట్ సంస్థ నష్టాల్లో ఉన్న ప్రాజెక్టును ప్రభుత్వ పరిధిలోకి తెచ్చి ప్రజలకు మేలు చేయాలని సీఎం భావించడం ఒక విప్లవాత్మక అడుగు అని వేముల విరేశం స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును తట్టుకోలేక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ నిధుల విడుదలను అడ్డుకుంటున్నారని వీరేశం తీవ్రంగా విమర్శించారు. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా ఉన్న జైపాల్ రెడ్డి హైదరాబాద్ మెట్రోకు పూర్తి సహకారం అందించగా.. నేటి కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టడం బాధాకరమన్నారు.
కేంద్రం అడ్డంకులు సృష్టిస్తుంటే వారిని ప్రశ్నించకుండా బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. మెట్రో విస్తరణకు కేంద్ర అనుమతులు తేవడంలో బీజేపీ ఎంపీలను ఎందుకు నిలదీయడం లేదని కేటీఆర్‌ను ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిని, హైదరాబాద్ భవిష్యత్తును అడ్డుకునే శక్తులకు రాబోయే జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, కిషన్ రెడ్డి వెంటనే రాజకీయాన్ని పక్కనబెట్టి మెట్రో నిధుల విడుదలకు సహకరించాలని ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం డిమాండ్ చేశారు.






