రూ.5 లక్షల కోట్ల స్కామ్‌కు సీఎం తెరలేపిండు.. మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు

by Kema Shiva Kumar |

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పారిశ్రామిక భూముల రెగ్యులరైజేషన్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రూ.5 లక్షల కోట్ల స్కామ్‌కు తెరలేపాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.

రూ.5 లక్షల కోట్ల స్కామ్‌కు సీఎం తెరలేపిండు.. మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పారిశ్రామిక భూముల రెగ్యులరైజేషన్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రూ.5 లక్షల కోట్ల స్కామ్‌కు తెరలేపాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ రోజు ఆయన తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నగరంలో పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ పేరుతో రూ.5 లక్షల కోట్ల కుంభకోణానికి సీఎం తెరలేపాడని ఆరోపించారు. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణమని అన్నారు. 9,292 ఎకరాల భూమిపై ముఖ్యమంత్రి కన్నేశాడని అన్నారు. కేవలం 30 శాతం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలని.. ఈ పాలసీ ద్వారా కుంభకోణం చేయబోతున్నారని తెలిపారు. గతంలో తమ ప్రభుత్వం కనీసం 100 శాతం నుంచి అత్యధికంగా 200 శాతం ఎస్ఆర్‌ఓ రేట్లు చెల్లించాలని నిర్దేశించగా, కాంగ్రెస్ కేవలం 30 శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని కొత్త పాలసీ తెచ్చిందని అన్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్‌లో భారీ స్కామ్‌కు ప్లాన్ చేశారని మండిపడ్డారు. ఇప్పటికే ఆ భూములకు సంబంధించి రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, అనుచరులు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారని మీడియాకు వివరించారు. అందుకే ఆగమేఘాల మీద కేవలం ఏడు రోజుల్లో దరఖాస్తులు, మరో ఏడు రోజుల్లో ఆమోదం, 45 రోజుల్లో రెగ్యులరైజేషన్ అంటూ హడావిడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

పారిశ్రామికవేత్తలారా.. బీ కేర్‌ఫుల్

కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన హైదరాబాద్ పారిశ్రామిక భూముల ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ అనేది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్‌కు ఏటీఎంగా మారిందన్నారు. ఆ భూములు కొనుగోలు చేసినా.. రెగ్యులరైజేషన్ చేసుకున్నా.. పారిశ్రామికవేత్తలకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ప్రజల ఆస్తిని అప్పనంగా కొట్టేస్తామంటే కుదరదని అన్నారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ అవసరమైతే న్యాయపోరాటం చేస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం మళ్లీ వచ్చిన తర్వాత నగరంలోని పారిశ్రామిక భూముల లావాదేవీలపై తప్పకుండా విచారణ ఉంటుందని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కేవలం రేవంత్ రెడ్డి అవినీతి కోసం ఈ పాలసీలో భాగస్వాములై భవిష్యత్తులో ఇబ్బందులు పడవద్దని పారిశ్రామికవేత్తలకు కేటీఆర్ సూచించారు. పరిశ్రమలు తీసుకొచ్చేందుకు రూపొందించిన టీఎస్ ఐ-పాస్ విధానాన్ని పారిశ్రామిక భూములు అమ్మేందుకు కాంగ్రెస్ వాడుతోందని కేటీఆర్ ఆరోపించారు.

Next Story