- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్‌కు అనుమతులివ్వొద్దు.. సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్ బృందం విజ్ఞప్తి
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బృందం ఢిల్లీ (Delhi) పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బృందం ఢిల్లీ (Delhi) పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది.ఈ మేరకు ఇవాళ ఉదయం 11 గంటలకు ఇంగ్లండ్ మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్ (Tony Blair)తో సమావేశమైన వారు కాసేపటి క్రితం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) నిర్మించ తలపెట్టిన గోదావరి-బనచర్ల (Godavari-Banakacharla) ప్రాజెక్ట్‌పై అభ్యంతరాలను సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఆర్ పాటిల్‌కు వివరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ ప్రాజెక్ట్ తెలంగాణ హక్కులకు, ముఖ్యంగా గోదావరి నది జలాలపై హక్కులకు భంగం కలిగిస్తుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి-కృష్ణ-పెన్నా నదుల అనుసంధాన పథకంలో భాగంగానే పోలవరం నుంచి 200-400 టీఎంసీ నీటిని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మళ్లించే లక్ష్యంతో ఉన్నారని మంత్రి వివరించిననట్లుగా తెలుస్తోంది. గోదావరి నీటిని ఏపీకి ఏకపక్షంగా మళ్లించడం వల్ల తెలంగాణకు నీటి లభ్యత తగ్గుతుందని, ఇది రాష్ట్రంలోని వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఇక భద్రాచలం (Bhadrachalam), మణుగూరు (Manuguru) వంటి ప్రాంతాల్లో ముంపు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని విన్నవించారు. గోదావరి - బనకచర్ల ప్రాజెక్ట్‌తో ఏపీ ప్రభుత్వం గోదావరి నది జల వివాదాల ట్రైబ్యునల్ అవార్డు (1980)తో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (2014)ను చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. తమకు కనీస సమాచారం లేకుండానే.. ప్రాజెక్ట్‌కు సంబంధించి డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి పంపారని ఎట్టి పరిస్థితుల్లో పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని సీఎం రేవంత్ బృందం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కొరినట్లుగా సమాచారం.
తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు.. ఉత్తమ్
సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్‌పై తమ అభ్యంతరాలను కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు వివరించామని అన్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తిగా ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని తెలిపామని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పాటిల్ కూడా తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారని వివరించారు. అదేవిధంగా బనకచర్ల ప్రాజెక్ట్‌పై ఇంకా పూర్తి డీపీఆర్ రాలేదని చెప్పారని తెలిపారు. తమకు కృష్ణా, గోదావరి జలాల్లో 1500 టీఎంసీలకు ఎన్‌వోసీ ఇస్తేనే.. గోదావరి - బనకచర్ల ప్రాజెక్టుకు అభ్యంతరం లేదని కేంద్ర మంత్రికి చెప్పామని అన్నారు. ఏపీ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు వస్తున్నాయని.. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మాత్రం వేగం కనిపించడం లేదని కామెంట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం చేయబోమని, గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో త్వరలోనే ఇరు రాష్రాల ముఖ్యమంత్రుల భేటీ ఏర్పాటు చేస్తామంటూ కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ హామీ ఇచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా చూడాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇచ్చంపల్లి - నాగార్జున సాగర్ లింక్‌తో పెన్నా బేసిన్‌కు నీరు తీసుకెళ్లొచ్చని అన్నారు. ఆ అంశంపై తాము చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. పలు రాష్ట్రాలు ప్రాజెక్టుల అనుమతుల కోసం చూస్తున్నా.. ఏపీ ప్రాజెక్టులకే త్వరగా అనుమతులు ఇస్తున్నారని చెప్పామన్నారు. ఇక మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్‌కు నిధులు ఇవ్వాలని కోరామని, రాష్ట్ర ప్రాజెక్టులకు నీట కేటాయింపుల చేయాలని చెప్పామని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్క-సారక్క, తుమ్మడిహట్టికి కేటాయింపులు కోరామని మంత్రి ఉత్తమ్ వివరించారు.






