ప్రాజెక్టులపై సీఎం రేవంత్ ‘వ్యూహం’.. నేడు ఇరిగేషన్‌పై రేవంత్ కీలక రివ్యూ!

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-27 01:22:33  IST  )

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

ప్రాజెక్టులపై సీఎం రేవంత్ ‘వ్యూహం’.. నేడు ఇరిగేషన్‌పై రేవంత్ కీలక రివ్యూ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టుల ప్రగతిపై సీఎం రేవంత్‌రెడ్డి నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సాగునీటి ప్రాజెక్టుల పనితీరు, ప్రస్తుత పరిస్థితులు, ఎదురవుతున్న సవాళ్లపై అధికారులతో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిసింది. సీఎం క్యాంప్ ఆఫీసులో నిర్వహించే ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డితో పాటు అధికారులు హాజరుకానున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో కాళేశ్వరంపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. కాళేశ్వరం నివేదికను పరిగణలోకి తీసుకోవద్దని మాజీ సీఎం కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు, పలువురు అధికారులు కోర్టులో కేసు వేశారు. దాంతో కొన్ని నెలలుగా దాని మీద విచారణ చేపట్టిన హైకోర్టు ఇటీవలే చివరి తీర్పునిచ్చింది. నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీశ్‌ మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అంతేకాకుండా నిబంధనలు ఫాలో కాకుండా ఘోష్ కమిషన్ విచారణ చేపట్టి నివేదికను అందించిందని వెల్లడించింది. దాంతో ఈ తీర్పుతో కేసీఆర్, హరీశ్ రావుతోపాటు ఇతర అధికారులకు క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. అయితే.. ఈ తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో ఈ కేసుపై తాడోపేడో తేల్చుకోవాలని అనుకుంటున్నది. అందులో భాగంగానే నేడు సీఎం నిర్వహించనున్న ఈ కీలక సమావేశంలో హైకోర్టు తీర్పుపై చర్చ నిర్వహించి.. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

తుమ్మిడిహెట్టి నిర్మాణంపై డిస్కస్

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల పేరిట ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో కొన్ని పనులు కూడా చేసింది. అయితే.. ఆ తరువాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడగా కేసీఆర్ అధికారం చేపట్టిన తరువాత ఆ ప్రాజెక్టును పక్కన పెట్టారు. అక్కడ నీటి లభ్యత లేదన్న కారణంతో ఆ ప్రాజెక్టును కాళేశ్వరంలోని మేడిగడ్డకు మార్చారు. దాంతో రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చాక రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్టుపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఇటీవలే ఈ ప్రాజెక్టుపై సర్వే సైతం చేయించింది. తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా సుందిళ్లకు నీటిని తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. సర్వే పూర్తయిన నేపథ్యంలో ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు సర్కార్ కసరత్తు చేస్తున్నది. నేడు నిర్వహించనున్న ఈ సమావేశంలో తుమ్మిడిహెట్టిపైనా ప్రధానంగా చర్చించబోతున్నారు.

మేడిగడ్డకు రిపేర్లు..

మరోవైపు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు డ్యామేజీలు ఏర్పడిన సంగతి తెలిసిందే. మేడిగడ్డకు సంబంధించిన పిల్లర్లు కుంగుబాటుకు గురై ప్రాజెక్టు ప్రమాదకర పరిస్థితిలోకి పడిపోయింది. దాంతో రెండున్నరేళ్లుగా ఆ ప్రాజెక్టు పనికిరాకుండానే ఉండిపోయింది. తాజాగా.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మేడిగడ్డకు మరమ్మతులు చేయించి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలనుకున్నారు. అంతేకాకుండా కేంద్ర సంస్థ అయిన ఎన్‌డీఎస్‌ఏ నిబంధనలకు అనుగుణంగానే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. దాంతో మేడిగడ్డ ఏరియాలో మరమ్మతు పనుల కోసం భూ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. అయితే.. ఈ పరీక్షలు సైతం వానాకాలం ప్రారంభంలోపే ముగియాలని సీఎం రేవంత్ ఇటీవల అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో మేడిగడ్డ మరమ్మతులపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. మేడిగడ్డ విషయంలో పరీక్షలు పూర్తయ్యాక తదుపరి తీసుకోవాల్సిన చర్యలు ఇతర అంశాలపై చర్చించనున్నారని సమాచారం. వీటితోపాటే రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులపైనా సీఎం రేవంత్ ఇరిగేషన్ అధికారులతో డిస్కస్ చేయనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ తదితర ప్రాజెక్టులతోపాటు పూడిక నిండిపోయిన జలాశయాలపైనా చర్చించబోతున్నారని తెలిసింది.

Next Story