- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రకటన.. తమిళనాడులో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42 శాతం, 27 శాతం ఎస్సీ, ఎస్టీలకు, మొత్తంగా 69 శాతం రిజర్వేషన్లు ఇవ్వబోతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘తమిళనాడు అవలంబిస్తున్న సీఎం బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం హృదయాన్ని తాకుతుంది. తెలంగాణలోనూ ఈ స్కీమ్‌ను వచ్చే ఏడాది నుంచి ప్రారంభిస్తామని ప్రకటిస్తున్నా’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వెల్లడించారు. చెన్నై జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విద్యలో ముందంజలో తమిళనాడు కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. ఇంత మంచి కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు సంతోషకరమన్నారు. అన్నాదొరై, కరుణానిధి, కామరాజ్ వంటి గొప్ప యోధుల జన్మస్థలం తమిళనాడు అని కొనియాడారు. కరుణానిధి విజన్‌ను అమలు చేస్తున్న స్టాలిన్, ఉదయనిధిలను అభినందిస్తున్నట్లు చెప్పారు. ఇందిరాగాంధీ కామరాజ్ ప్లాన్‌ను తీసుకువచ్చారని.. కామరాజ్ తమిళనాడులో తీసుకువచ్చిన విద్యావిధానాన్ని దేశం అనుసరిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ కళాశాలలకు వెళ్లే బాలురు, బాలికలకు నాన్ ముదలవన్ (స్కిల్ డెవలప్‌మెంట్) రూ.10 వేల ఉపకార వేతనం స్కీమ్‌లు ఉండడం అదృష్టమన్నారు. తమిళనాడు పేదలకు అండగా మంచి సీఎం స్టాలిన్ ఉన్నారని.. ఎన్నో శతాబ్దాల నుంచి తమిళ, తెలుగు రాష్ట్రాలు, ప్రజల మధ్య సాంస్కృతిక, చారిత్రక పరమైన బలమైన సంబంధం ఉందని చెప్పారు. 1991 సరళీకరణ తర్వాత సరళీకృత ఆర్థిక విధానాలతో తమిళనాడులో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అభివృద్ధి చెందిందని.. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాలు అభివృద్ధి చెందాయని అన్నారు. సామాజిక న్యాయం అమలులో తమిళనాడు-తెలంగాణ మధ్య సారూప్యతలున్నాయని తెలిపారు. తాము కరుణానిధిని స్ఫూర్తిగా తీసుకున్నామని వెల్లడించారు.
తెలంగాణలో 69 శాతం రిజర్వేషన్లు..
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42 శాతం, 27 శాతం ఎస్సీ, ఎస్టీలకు, మొత్తంగా 69 శాతం రిజర్వేషన్లు ఇవ్వబోతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. భారతీయులంతా తమిళనాడు విద్యా విధానంతో స్ఫూర్తి పొందారని.. దేశంలో మొట్టమొదటగా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించింది ఇక్కడే అని అన్నారు. ఇక్కడ అమలు చేస్తున్న విద్యా విధానం తమకు ప్రేరణ కలిగించిందన్నారు. దక్షిణాదికి చెందిన కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు తమిళనాడు విద్యావిధానం ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. తెలంగాణలోనూ తమ ప్రభుత్వం, తాను విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రిగా ఉన్నా విద్యా శాఖను తన దగ్గరే ఉంచుకున్నానని.. యువతలో నైపుణ్యత పెంచడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీని ప్రారంభించామని చెప్పారు. తెలంగాణ నుంచి ఏటా 1.10 లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు కళాశాలల నుంచి బయటకు వస్తున్నారని తెలిపారు. నైపుణ్యలేమితో ఉద్యోగాలు దక్కకడం లేదన్నారు. పీపీపీ విధానంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని.. దానికి చైర్మన్‌గా ఆనంద్ మహేంద్రను నియమించామని తెలిపారు. కార్పొరేట్ సంస్థల అధిపతులను డైరెక్టర్లుగా నియమించామన్నారు.
27న గ్రూప్ 1 అభ్యర్థులకు నియామక పత్రాలు..
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27న శిల్పకళా వేదికలో గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన వారికి సీఎం రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు అందించనున్నారు. 18 శాఖలకు సంబంధించి 563 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సీఎస్ రామకృష్ణారావు ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సీఎస్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందరు మంత్రులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని ఆదేశాలు జారీ చేశారు.






