కాళేశ్వరం విషయంలో కోర్టు తీర్పుపై CM రేవంత్ స్పందన.. సంచలన నిర్ణయం

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-27 10:08:20  IST  )

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నియామకం విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.

కాళేశ్వరం విషయంలో కోర్టు తీర్పుపై CM రేవంత్ స్పందన.. సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నియామకం విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడారు. కమిషన్ నియామకాన్ని తప్పుబడుతూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. ఈ తీర్పు ద్వారా ప్రభుత్వం అనుసరించిన విధానం సరైనదేనని తేలిందని ఆయన స్పష్టం చేశారు. కోర్టు తీర్పును విశ్లేషిస్తూ సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నియామకం ఏకపక్షమని కోర్టు ఎక్కడా పేర్కొనలేదు. కమిషన్ నియామకం చట్టవిరుద్ధమని కేసీఆర్, హరీష్ రావు చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టేయడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. "మరి ఇప్పుడు చెప్పండి.. ఇది వాళ్ల విజయమా? లేక ప్రజా ప్రభుత్వం సాధించిన విజయమా?" అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

నివేదిక యధాతథం - కేవలం చర్యలపైనే స్టే..

కమిషన్ విచారణ ప్రక్రియకు ఎటువంటి ఆటంకం లేదని సీఎం వివరించారు. సెక్షన్ 8B, 8C ప్రకారం ప్రస్తుతం ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని మాత్రమే కోర్టు సూచించింది. కమిషన్ విచారణ, నివేదిక సమర్పణ ప్రక్రియ యధాతథంగా కొనసాగుతుంది. కాళేశ్వరం అక్రమాలపై సమగ్ర విచారణ జరగాల్సిందేనని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై తక్షణమే సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఒకవేళ సీబీఐ విచారణకు ఆదేశించకపోతే తదుపరి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో స్వయంగా ఢిల్లీకి వెళ్లి సీబీఐ డైరెక్టర్‌ను కలిసి పూర్తి వివరాలు సమర్పిస్తామని సీఎం వెల్లడించారు. కాళేశ్వరం పాపాలను కప్పిపుచ్చుకోవడానికి ఎంత ప్రయత్నించినా, దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story