- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫలించిన CM రేవంత్ మంత్రాంగం.. అధిక వడ్డీ రుణాల రీషెడ్యూల్‌కు కేంద్రం ఓకే
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న అధిక వడ్డీ రుణాలను రీషెడ్యూల్ చేసేందుకు కేంద్రం ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న అధిక వడ్డీ రుణాలను రీషెడ్యూల్ చేసేందుకు కేంద్రం ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా చేసిన ప్రయత్నాలు మొత్తానికి ఫలించాయి. దీనికి తోడు ఈ రెండేళ్లలో సుమారు రూ. 25 వేల కోట్ల కొత్త అప్పును తక్కువ వడ్డీ, ఎక్కువ వాయిదాల్లో చెల్లించేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంతో పోలిస్తే తక్కువ వడ్డీ, వాయిదాలు ఎక్కువగా ఉండటం వలన ప్రభుత్వానికి ప్రతి ఏటా దాదాపు రూ. 2 వేల కోట్లు ఆదా కానున్నాయి. అయితే, ఈనెల 5వ తేదీన రూ.5 వేల కోట్ల రుణాన్ని ఆర్బీఐ ఇప్పటికే విడుదల చేసింది. ఆ సొమ్ముతో రూరల్ ఎలక్ర్టిఫికేషన్ కార్పొరేషన్ దగ్గర ఎక్కువ వడ్డీలకు తీసుకున్న రుణాలను ప్రభుత్వం చెల్లించింది.
కేంద్రాన్ని ఒప్పించిన రేవంత్..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అప్పులపై సమీక్ష చేశారు. వివిధ కార్పొరేషన్ల పేరుతో ఇష్టానుసారంగా ప్రైవేటు ఫైనాన్సింగ్ సంస్థల ద్వారా అధిక వడ్డీలకు రుణాలు తీసుకొచ్చినట్లు గుర్తించారు. వీటన్నింటిని పదేళ్ల కాలపరిమితిలో చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనితో వడ్డీలు, కిస్తీలు చెల్లించేందుకు ప్రతి ఏటా ఖజానాపై అధిక భారం పడేది. అదే ఆర్బీఐ దగ్గర తీసుకునే అప్పులు 7 నుంచి 7.5 శాతం లోపే ఉంటాయి. వాటిని 25 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు చెల్లించవచ్చు. కానీ ఆర్‌ఈసీ దగ్గర చేసిన అప్పులకు 11 శాతం వడ్డీ, 10 ఏళ్లలో కచ్చితంగా చెల్లించాల్సి ఉంది. ఇది సర్కారుకు పెద్ద సమస్యగా మారింది. అందుకే వీటిని రీ షెడ్యూల్ చేయాలని ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం రేవంత్ పలుసార్లు విజ్ఞప్తి చేశారు. అన్ని కోణాల్లో రాష్ట్ర అర్థిక పరిస్థితిని అధ్యయనం చేసిన సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ పాత అప్పులను రీ షెడ్యూల్ చేసేందుకు అంగీకారం తెలిపింది.
ఎఫ్ఆర్‌బీఎం పరిధికి లోబడే రీషెడ్యూల్
కేసీఆర్ హయాంలో ఆర్బీఐ ద్వారా ప్రతినెలా తీసుకునే అప్పులు కాకుండా, కార్పొరేషన్ల పేరుతో విచ్చిలవిడిగా అప్పులు చేశారు. ఆ అప్పులు ప్రభుత్వ పరిధిలోకి రావని నాటి పాలకులు వాదించారు. కానీ అన్ని అప్పులను కేంద్రం ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి తెచ్చింది. దీంతో 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ద్వారా తీసుకునే రుణాల్లో కోత పడింది. ఎలాగు కార్పొరేషన్ అప్పులను ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి తెచ్చినందున అధిక వడ్డీలు చెల్లించే అప్పులను రీ షెడ్యూల్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే వినతులు చేయడంతో కేంద్రం ఎట్టకేలకు అంగీకరించింది. దీంతో 11శాతం వడ్డీ చెల్లించే సుమారు రూ.25 వేల కోట్ల రుణాలను కేంద్రం రీ షెడ్యూల్ చేసే వెసులుబాటు కలిగింది.
ఆర్‌బీఐ వద్ద అప్పులు, ఆర్ఈసీకి చెల్లింపులు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా బాండ్ల అమ్మకాల ద్వారా రుణాలు సేకరించేది. అయితే, దాంతో సంబంధం లేకుండా రూ. 25 వేల కోట్ల అప్పును రెండేళ్లలో అడ్జెస్ట్ చేసేందుకు ఆర్బీఐ అంగీకారం తెలిపింది. ఆ విధంగా తీసుకున్న అప్పును వెంటనే ఆర్‌ఈసీకి చెల్లించేందుకు సర్కారు సిద్ధమైంది. అందులో భాగంగానే రెండ్రోజుల కిందట ఆర్బీఐ ఒకేరోజు రూ.5 వేల కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ నిధులను ప్రభుత్వం ఇతర ఖర్చులు, పథకాలకు ఉపయోగించకుండా అధిక వడ్డీలతో చేసిన అప్పులకు పేమెంట్ చేసింది. ఈ విధంగా చేయడం వల్ల ప్రతి ఏటా ప్రభుత్వానికి సుమారు రూ. 2 వేల కోట్లు ఆదా అవుతాయని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.






